Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్‌ను సున్నాకే పెవిలియన్‌కు పంపిన బౌలర్లు వీరే!

  • మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్
  • వరుసగా రెండో మ్యాచ్‌లో కింగ్‌ డకౌట్
  • ఐపీఎల్‌లో కోహ్లీని డకౌట్ చేసిన బౌలర్ల జాబితా
virat kohli duck

virat kohli duck

Virat Kohli Duck vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ చివరి బంతికి 2 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి డకౌట్ కావడమే. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సున్నాకే ఔటైన కోహ్లీ.. ఇప్పుడు ముంబైపై కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ముంబై పేసర్ దీపక్ చహర్ వేసిన ఓవర్‌లో కోహ్లీ షాట్ ఆడగా.. మిడాఫ్‌లో రాజ్ బవా అద్భుత డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. దాంతో ఐపీఎల్‌లో కోహ్లీని డకౌట్ చేసిన బౌలర్ల జాబితాలో ఇప్పుడు చహర్ కూడా చేరాడు. ఈ జాబితాలో ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నాథన్ కౌల్టర్ నైల్, ట్రెంట్ బౌల్ట్ వంటి దిగ్గజాలు ఉన్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ డకౌట్ కావడం అభిమానులను నిరాశకు గురి చేసినప్పటికీ.. జట్టు విజయం మాత్రం ఆర్సీబీ అభిమానులకు ఊరటనిచ్చింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ రేసులో బలమైన స్థితిలో నిలిచింది.

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీని డకౌట్ చేసిన బౌలర్లు:
2008 – ఆశిష్ నెహ్రా (ముంబై ఇండియన్స్)
2014 – జహీర్ ఖాన్ (ముంబై ఇండియన్స్)
2014 – భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
2014 – సందీప్ శర్మ (పంజాబ్ కింగ్స్)
2016 – ధవల్ కులకర్ణి (గుజరాత్ లయన్స్)
2017 – నాథన్ కౌల్టర్ నైల్ (కేకేఆర్)
2022 – దుష్మంత చమీరా (లక్నో సూపర్ జెయింట్స్)
2022 – మార్కో జాన్సెన్ (ఎస్‌ఆర్‌హెచ్)
2022 – జగదీశ సుచిత్ (ఎస్‌ఆర్‌హెచ్)
2023 – ట్రెంట్ బౌల్ట్ (రాజస్థాన్ రాయల్స్)
2026 – ప్రిన్స్ యాదవ్ (లక్నో సూపర్ జెయింట్స్)
2026 – దీపక్ చహర్ (ముంబై ఇండియన్స్)