Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన
  • 9 ఇన్నింగ్స్‌లలో 400 పరుగులు
  • తొలి ఆటగాడిగా వైభవ్ రికార్డు
Vaibhav Sooryavanshi Record

Vaibhav Sooryavanshi Record

ఐపీఎల్ 2026 సీజన్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన ఈ యువ ఆటగాడు.. ఈసారి నిలకడను తన బలంగా మార్చుకుని టోర్నమెంట్‌లో టాప్ రన్-స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లలో 400 పరుగులు చేశాడు. అతడి సగటు 44.44 కాగా.. స్ట్రైక్‌రేట్ 238.09గా ఉంది. ఈ సీజన్‌లో 400 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ స్కోర్లు వరుసగా 52, 31, 39, 78, 0, 46, 8, 103, 43గా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో తన నిలకడను చూపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తరఫున పంజాబ్‌ కింగ్స్‌పై కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి మరోసారి తన దూకుడును చూపించాడు. మాజీ క్రికెటర్లు మురళి కార్తీక్, మోహిత్ శర్మలు సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొహిత్ మాట్లాడుతూ.. ‘ప్రతి స్టేడియంలో ఒకే స్థాయి ప్రేమ, ఆదరణ పొందిన ఆటగాడు ఎంఎస్ ధోనీ మాత్రమే. ఇప్పుడు అదే స్థాయి క్రేజ్‌ను సూర్యవంశీ పొందుతున్నాడు. వైభవ్ బాగా ఆడుతున్నాడు. అలవోకగా సిక్సులు బాదడం చూస్తుంటే.. చాలా ముచ్చటేస్తుంది’ అని పేర్కొన్నాడు. ధోనీతో పోలికలు రావడం అతని ప్రతిభకు మరో నిదర్శనం. వైభవ్ ప్రదర్శన ఐపీఎల్ 2026లో ఒక పెద్ద హైలైట్‌గా నిలుస్తోంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. చివరి 6 ఓవర్లలో 71 పరుగులు అవసరమైన సమయంలో డొనోవన్‌ ఫెరీరా (52 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. శుభమ్‌ దూబె (31 నాటౌట్‌) అతనికి అండగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభంలో వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడి ఐదు సిక్సులతో బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అలాగే యశస్వి జైస్వాల్‌ (51) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మధ్యలో చాహల్ (3/36) వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అయినప్పటికీ ఫెరీరా, దూబె జోడి చివర్లో మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు.