Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్‌.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?

  • ముగింపు దశకు ఐపీఎల్ 2026
  • అంతర్జాతీయ సీజన్‌పై బీసీసీఐ దృష్టి
  • వచ్చే 7-10 రోజుల్లో బీసీసీఐ కీలక మీటింగ్‌
Bcci

Bcci

Team India Selection for vs Afghanistan Test: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 ముగింపు దశకు చేరుకుంటుండగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ సీజన్‌పై దృష్టి పెట్టింది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే అఫ్గానిస్థాన్‌తో భారత్ ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ త్వరలో కీలక సమావేశం కానుందని సమాచారం. ముఖ్యంగా స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ భవిష్యత్తుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. వచ్చే 7-10 రోజుల్లో బీసీసీఐ, సెలక్షన్ కమిటీ మధ్య సమావేశం జరగనుంది. రాబోయే నెలల్లో టీమిండియా రోడ్‌మ్యాప్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాదు ఫాస్ట్ బౌలర్ల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. 2026 ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌ల్లో భారత జట్టు ఎంపికకు పరిశీలనలో ఉన్న పేసర్లకు వర్క్‌లోడ్ పెంచాలని బోర్డు సూచించినట్లు సమాచారం. ఇటీవల ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ వంటి యువ పేసర్లు బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో ఉన్నట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆకిబ్ నబీ కూడా టెస్టు జట్టుకు బలమైన అభ్యర్థిగా మారాడు. రంజీ ట్రోఫీలో ఆకట్టుకునే ప్రదర్శనతో అతడు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

అఫ్గానిస్థాన్‌తో ఒకే టెస్టు మ్యాచ్ అయినప్పటికీ.. భారత జట్టును బలహీనపరచాలనే ఆలోచన బీసీసీఐకి ఏమాత్రం లేదని తెలుస్తోంది. అందుకే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌కు ఎంపిక చేయాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం. అయితే గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడని సీనియర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ తప్పకపోవచ్చని తెలుస్తోంది. ‘అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ కాబట్టి టెస్టు జట్టులో రాజీ పడాలనే ఉద్దేశం సెలెక్టర్లకు లేదు. అత్యుత్తమ జట్టునే బరిలోకి దింపాలనుకుంటున్నారు. యువకులను అంత సులభంగా ఛాన్సెస్ ఇవ్వాలనుకోవడం లేదు. సిరాజ్ వర్క్‌లోడ్‌ను బీసీసీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ప్రసిద్ధ్ కృష్ణ ఏప్రిల్ 24 తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఆడలేదు. నితీష్ కుమార్ రెడ్డి కూడా సీమ్ బౌలింగ్ విభాగంలో ఉపయోగపడతాడని భావిస్తున్నారు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

భారత్ వచ్చే తొమ్మిది నెలల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో మొత్తం తొమ్మిది టెస్టులు ఆడనుంది. అయితే అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భాగం కాదు. అయినప్పటికీ బీసీసీఐ ఈ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకుంటూ బలమైన జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తోంది.