Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్‌ఆర్‌హెచ్‌ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • గుజరాత్ తరఫున కాగిసో రబాడ అద్భుత ప్రదర్శన
  • ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 కీలక వికెట్లు
  • ఎస్‌ఆర్‌హెచ్‌ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు
Kagiso Rabada Interview

Kagiso Rabada Interview

Kagiso Rabada Reacts After GT’s Dominant Win Over SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న స్టార్ పేసర్ కాగిసో రబాడ మరోసారి మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)తో జరిగిన మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 రన్స్ మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్స్ తీశాడు. గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రబడాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రబడా.. తన బౌలింగ్, పిచ్ పరిస్థితులు, డ్రాప్ క్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మ్యాచ్ ఆరంభంలోనే కీలక క్యాచ్‌ను వదిలేయడంపై రబాడ స్పందిస్తూ.. ‘ఆ బంతి స్పీడ్‌ను నేను సరిగా అంచనా వేయలేకపోయాను. అందుకే వెంటనే రియాక్ట్ కాలేకపోయాను. అది చాలా కీలకమైన వికెట్. అప్పటికే గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో మూడో వికెట్ పడితే.. మాకు ఇంకా ప్రయోజనం ఉండేది. అయితే అదృష్టవశాత్తూ తర్వాత వికెట్ పడింది’ అని చెప్పుకొచ్చాడు. ప్రతి సీజన్‌లో తాను జట్టుకోసం తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని తెలిపాడు. ‘నేను ఏ జట్టులో ఆడినా.. ఆ జట్టు కోసం నా వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటాను. ఈ జట్టులో నా పాత్ర ఏమిటో స్పష్టంగా చెప్పడంతో పాటు నాపై పూర్తి నమ్మకం ఉంచారు. అందుకే నేను మైదానంలో వంద శాతం కష్టపడుతున్నా’ అని పేర్కొన్నాడు.

బౌలర్లకు రిథమ్ ఎంత ముఖ్యమో కూడా రబాడ వివరించాడు. ‘రిథమ్ అనేది చాలా ముఖ్యం. ఎక్కువగా బౌలింగ్ చేయడం అవసరం. అదే సమయంలో మ్యాచ్‌కు ఫిట్‌గా ఉండేలా శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. సరైన రిథమ్ దొరికితేనే బౌలర్‌గా పూర్తి స్థాయిలో ప్రభావం చూపగలుగుతాం’ అని చెప్పాడు. పిచ్‌కు అనుగుణంగా బౌలింగ్ చేయడమే తమ విజయ రహస్యమని వెల్లడించాడు. ‘ముందుగా పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టు బౌలింగ్ చేయాలి. ప్రతి బౌలర్‌కు ప్రత్యేకమైన బలం ఉంటుంది. ఆ బలాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో చూడాలి. ఒక ప్లాన్ పనిచేయకపోతే.. మరో ప్లాన్‌కు మారాలి. మేము అదే ప్రయత్నించాం’ అని రబాడ తెలిపాడు.

అహ్మదాబాద్ పిచ్‌పై హార్డ్ లెంగ్త్ బౌలింగ్ కీలకమైందని రబాడ స్పష్టం చేశాడు. ‘ఈ పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బౌలర్లు మొదట చూపించారు. ఆ తర్వాత మేము అదే ప్లాన్‌ను ఇంకా మెరుగ్గా అమలు చేయడానికి మేము ప్రయత్నించాం. మ్యాచ్ సాగుతున్నా కొద్ది పిచ్ మరింత కఠినంగా మారింది. బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సహనం, సింపుల్ బౌలింగ్ మాకు బాగా ఉపయోగపడింది’ అని చెప్పుకొచ్చాడు.