Site icon NTV Telugu

Rishabh Pant Injury: కుడి చేతికి మరో గాయం అయింది.. ఓటమికి ఏదో కారణం చెప్పడం కష్టం!

Rishabh Pant Interview

Rishabh Pant Interview

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ ఓటమిని ఎదుర్కొంది. 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లక్నో 200 పరుగులకే పరిమితమైంది. లక్నో కెప్టెన్‌ రిషబ్ పంత్ మ్యాచ్ అనంతరం జట్టు ప్రదర్శనపై స్పందించాడు. తన ఎడమ మోచేతి గాయం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో కుడి చేతికి మరో గాయం (టాటూ లాంటిది) తగిలిందని సరదాగా వ్యాఖ్యానించి నవ్వులు పూయించాడు. పంజాబ్ పరాజయానికి ఏదో ఒక కారణం చెప్పడం కష్టమని పంత్ వెల్లడించాడు.

మ్యాచ్‌లో ఎక్కడ తప్పు జరిగిందన్న ప్రశ్నకు రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ఒక్క అంశాన్ని చూపించడం కష్టం అని అన్నాడు. బౌలర్లు మంచి ప్రదర్శన ఇస్తున్నప్పటికీ.. ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో కూడా కొంత పాజిటివ్ సంకేతాలు కనిపించాయని, వాటితో ముందుకు సాగుతామని చెప్పాడు. జట్టుగా ప్రతి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించాడు. ఓపెనర్‌గా ఆయుష్‌ బదోనిని పంపించడంపై స్పందిస్తూ.. ఇది ముందుగానే తీసుకున్న నిర్ణయం అని తెలిపాడు. టాప్ ఆర్డర్‌లో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, మిడిల్ ఆర్డర్ కూడా బాధ్యత తీసుకోవాలని భావించామని వివరించాడు.

‘భారీ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదు. మేము ప్రయత్నం మాత్రం చేయగలిగాం. ప్రత్యర్థి జట్టు బాగా ఆడినప్పుడు మనం ఎంత చేసినా ఫలితం ఉపయోగం ఉండదు. పంజాబ్ జట్టు ప్రదర్శన అద్భుతం. మంచి క్రికెట్ ఆడిన జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మా జట్టుపై పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే మంచి ఫలితాలు ఆదుకుంటాము’ అని రిషబ్ పంత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టులో సానుకూల వాతావరణం కొనసాగుతుందని, ముందున్న మ్యాచ్‌ల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని పంత్ స్పష్టం చేశాడు.

Exit mobile version