NTV Telugu Site icon

Dinesh Karthik: లేటు వయస్సులో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు.. టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు పక్కా!

Dinesh Karthik Rcb

Dinesh Karthik Rcb

Fans Hails Dinesh Karthik after Heroics In RCB vs SRH Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2024లో టీమిండియా వెటరన్ బ్యాటర్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెలరేగుతున్నాడు. లేటు వయస్సులో తుపాన్‌ ఇన్నింగ్స్‌లు ఆడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన డీకే.. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు.

288 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆర్‌సీబీకి మంచి ఆరంభమే దక్కింది. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు పుంజుకుని.. వెంటవెంటనే 5 వికెట్స్ తీయడంతో ఆర్‌సీబీ వెనకపడిపోయింది. ఈ సమయంలో దినేష్ కార్తీక్‌ ఒంటరి పోరాటం చేశాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డీకే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అలరించాడు. డీకేకు ఎలా బౌలింగ్‌లో చేయాలో ఆర్ధం కాక సన్‌రైజర్స్‌ బౌలర్లు తలలు పట్టుకున్నారు. భువనేశ్వర్‌ కుమార్, ప్యాట్‌ కమ్మిన్స్‌ లాంటి సీనియర్‌ బౌలర్లకు కూడా డీకే చుక్కలు చూపించాడు. డీకే ఇన్నింగ్స్‌ ఫలితంగానే ఆర్‌సీబీ స్వల్ప తేడాతో ఓడిపోయింది.

Also Read: Travis Head: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్!

ఐపీఎల్ 2024లో దినేష్ కార్తీక్‌ అద్బుతంగా రాణిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివరలో బ్యాటింగ్‌ వచ్చి తుపాన్‌ ఇన్నింగ్స్‌లు ఆడేస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో చెలరేగిన డీకేపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘డీకే సూపర్ ఇన్నింగ్స్ ఆడావ్’, ‘లేటు వయస్సులో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు’, ‘టీ20 ప్రపంచకప్‌ 2024 జట్టులో డీకేకు చోటు పక్కా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు కూడా డీకే ఇలానే ఆడి.. మెగా టోర్నీలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

Show comments