RCB Physiotherapist Emily Story Is Fake: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సంబంధించిన ఓ భావోద్వేగ కథ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఎమిలీ’ అనే మహిళా ఫిజియోథెరపిస్ట్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి.. క్లీనర్‌గా పనిచేసి.. తర్వాత ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ సిఫారసుతో ఆర్సీబీ జట్టులో ఉద్యోగం సంపాదించిందంటూ పలు పోస్టులు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ఎమిలీ స్టోరీ పూర్తిగా కల్పితమని తాజాగా ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎమిలీ అనే మహిళ ఆర్సీబీ జట్టులోనే లేదు.
వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. బెంగళూరు మ్యాచ్‌ల సమయంలో మైదానంలోకి ఫిజియోగా వచ్చే ఈమె మీకు తెలుసా?, ఆమె జీవితం ఒక సినిమా కథకు పోటీ ఇవ్వగలదు అంటూ పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆమె పేరే ఎమిలీ. పద్నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె.. చదువు ఖర్చుల కోసం ఒక గ్రంథాలయంలో ఉద్యోగంలో చేరింది. ఆపై ఆస్ట్రేలియాలోని ఒక క్రికెట్ అకాడమీలో స్వీపర్‌గా పనిచేస్తూ జీవనం కోసం పోరాడింది. అక్కడ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళా క్రికెటర్ల కంటే.. మహిళా ఫిజియోలే ఎమిలీ దృష్టిని ఆకర్షించారు. రోజంతా పనిచేసినా ఇంటి అద్దె కూడా కట్టడానికి సరిపోని పరిస్థితుల్లో.. ఆమె ఫిజియోథెరపీ చదవాలని నిర్ణయించుకుంది. కేవలం తన సంకల్ప బలంతో ఒక ఫిజియోగా మారింది.
ఆ సమయంలోనే ఎమిలీ ఒక స్థానిక క్రికెటర్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక జీవితం అందంగా మారుతుందని భావించినప్పటికీ.. విధికి వక్రీకరించింది. ఆమె భర్త క్రికెట్‌లో రాణించలేకపోవడంతో.. మద్యంకు బానిసవ్వడంతో కుటుంబం విచ్చిన్నమైంది. భర్త వదిలిపోయినా.. పిల్లల కోసం పోరాటం చేసింది. ఆ సమయంలో ఒక శిక్షణా శిబిరంలో ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఒక కాంతి కిరణంలా ప్రవేశించాడు. ఆమె ప్రతిభను, జీవిత పోరాటాలను గుర్తించి.. ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యానికి పరిచయం చేశాడు. ఎమిలీ పోరాట గాథ విన్న ఆర్సీబీ.. గత సీజన్‌లో తమ ఫిజియో బృందంలోకి సాదరంగా ఆహ్వానించింది. ఈ రోజు తన కాళ్ళ మీద తాను నిలబడింది. ఈ కథను చాలామంది సోషల్ మీడియాలో భావోద్వేగంతో షేర్ చేశారు. ఓ పోస్టుకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ లైక్ కొట్టాడు. అయితే ఈ స్టోరీలు ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది.
ఫ్యాక్ట్ చెక్ ప్రకారం.. ఆర్సీబీ మెడికల్ లేదా ఫిజియో టీమ్‌లో ఎమిలీ మహిళ ఎవరూ లేరు. ప్రస్తుతం ఆర్సీబీ అధికారిక ఫిజియోథెరపిస్ట్‌గా టమారా జ్వెక్ పని చేస్తున్నారు. అలాగే వైరల్ కథలో చెప్పిన సంఘటనలు ఎక్కడా జరగలేదని నిర్ధారణ అయింది. సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్, షేర్ల కోసం సృష్టించిన కల్పిత స్టోరీగా దీన్ని గుర్తించారు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ సీజన్‌లో ఆర్సీబీ జట్టులో భాగమైనప్పటికీ.. ఇలాంటి ఎలాంటి సిఫారసు చేయలేదట. అతడికి ఈ కథతో ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఫేక్ స్టోరీపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు షేర్ చేయొద్దని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.
హేజిల్‌వుడ్, మీరు అద్భుతంగా చేశారు.. మీపై నా గౌరవం మరింత పెరిగింది..!!
బెంగళూరు మ్యాచ్‌ల సమయంలో మైదానంలోకి ఫిజియోగా వచ్చే ఈ అమ్మాయి మీకు తెలుసా..?
ఆమె పేరు ఎమిలీ..
ఆమె జీవితం ఒక సినిమా కథకు పోటీ ఇవ్వగలదు..
“మహిళలు బలహీనులు, వారు ఒంటరిగా కుటుంబాన్ని పోషించలేరు” అని చెప్పేవారికి… pic.twitter.com/6jtwfVLyEL— Sandy Papa YSCRP ☺️🇱🇸 (@PapalakeyPapa) May 18, 2026
