RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!

  • ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా ఆర్సీబీ
  • ఆర్సీబీ విజయాల వెనుక 'పంచ పాండవులు'
  • ఆర్సీబీ వరుసగా మూడో టైటిల్ కూడా గెలిచే అవకాశం
Rcb Success Story

Rcb Success Story

RCB Success Story: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. వరుసగా రెండో ఏడాది ట్రోఫీ గెలిచి ఐపీఎల్‌లో బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లు సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఆర్సీబీ ఈ అద్భుత విజయయాత్రపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఐదుగురు వ్యక్తులను ప్రత్యేకంగా ప్రస్తావించిన అశ్విన్.. విరాట్ కోహ్లీని ‘అల్టిమేట్ ఆల్ఫా’గా అభివర్ణించాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. ఆర్సీబీ విజయాల వెనుక ప్రధానంగా హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబట్, మెంటర్ దినేశ్ కార్తీక్, కెప్టెన్ రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ ఉన్నారని పేర్కొన్నాడు. జట్టు ప్రదర్శన చూస్తుంటే ఆర్సీబీ వరుసగా మూడో టైటిల్ కూడా గెలిచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ గురించి మాట్లాడిన అశ్విన్.. కింగ్ తపన, నాయకత్వ లక్షణాలు అసాధారణమని కొనియాడాడు. ‘కోహ్లీ వంటి స్టార్ ఆటగాడు కెప్టెన్సీని వదిలి రజత్ పాటిదార్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం గొప్ప విషయం. అతను ఒక మెంటర్‌గా, పెద్ద అన్నయ్యలా జట్టుకు అండగా నిలిచాడు. అంతటి స్టార్ అయినా జట్టు ప్రయోజనాల కోసం వెనుకకు తగ్గాడు. అందుకే అతను అల్టిమేట్ ఆల్ఫా’ అని అశ్విన్ ప్రశంసించాడు.

×
×
Ad

ఆర్సీబీ ప్రయాణం ప్రతి క్రీడాకారుడికి ఒక పాఠమని ఆర్ అశ్విన్ పేర్కొన్నాడు. ’17-18 సంవత్సరాలు ట్రోఫీ కోసం ఎదురుచూసిన జట్టు చివరకు 2025లో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచి మళ్లీ కప్‌ను నిలబెట్టుకుంది. కష్టపడినా ఫలితం రావడానికి సమయం పట్టొచ్చు. కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటే చరిత్ర సృష్టించవచ్చని ఆర్సీబీ నిరూపించింది. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఎక్కడికి వెళ్లినా సమతూకం ఉన్న జట్టును నిర్మిస్తాడు. నాణ్యమైన స్పిన్నర్లు, స్వింగ్ బౌలర్లు, వేగవంతమైన పేసర్లతో సరైన కాంబినేషన్ రూపొందించడం అతని ప్రత్యేకత. మో బోబట్‌తో కలిసి ఆర్సీబీ బ్యాక్‌రూమ్ స్టాఫ్ అద్భుతమైన జట్టును నిర్మించింది. స్థానిక పరిస్థితులపై దినేశ్ కార్తీక్ ఇచ్చిన సూచనలు కూడా జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి’ అని తెలిపాడు.

మహిళల జట్టు, పురుషుల జట్టు రెండూ వరుసగా టైటిళ్లు నిలబెట్టుకోవడం ఆర్సీబీ ఫ్రాంచైజీ గొప్పతనానికి నిదర్శనమని అశ్విన్ పేర్కొన్నాడు. ‘కేవలం రెండేళ్లలో నాలుగు ట్రోఫీలు గెలవడం సాధారణ విషయం కాదు. ఇది ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్రణాళిక, నిర్వహణ ఎంత బలంగా ఉందో చూపిస్తోంది’ అని కొనియాడాడు. ప్రస్తుతం ఆర్సీబీ జట్టు చూపిస్తున్న స్థిరత్వం, సమతూకం, విజేత మానసికతను చూస్తుంటే.. 2027లో కూడా ట్రోఫీ గెలిచి హ్యాట్రిక్ టైటిళ్లు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.