Site icon NTV Telugu

Praful Hinge: 4 వికెట్స్ తీస్తానని ముందే రాసిపెట్టుకున్నా.. నేను మానిఫెస్టేషన్‌ను నమ్ముతా!

Praful Hinge 4 Wickets

Praful Hinge 4 Wickets

విదర్భ యువ బౌలర్ ప్రఫుల్‌ హింగే అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన హింగే.. తన నాలుగు ఓవర్ల కోటాలో 34 పరుగులకు నాలుగు వికెట్స్ పడగొట్టాడు. అద్భుత ప్రదర్శతో ఈ విదర్భ ఎక్స్‌ప్రెస్‌ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా హింగే తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ.. ఈ ప్రదర్శనను తాను ముందే ఊహించుకున్నానని చెప్పాడు. గత ఏడాదే తన డెబ్యూ మ్యాచ్‌లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తానని రాసిపెట్టుకున్నా అని, అదే ఇప్పుడు నిజమైందని తెలిపాడు.

ఇలాంటి డెబ్యూ ఊహించారా? అని అడగ్గా… ‘అవును, నేను ముందే ఆలోచించాను. గత సంవత్సరం ఎక్కడో నేను రాసుకున్నాను. ఎప్పుడైనా నా మొదటి మ్యాచ్ ఆడితే తప్పకుండా నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తానని రాసిపెట్టుకున్నా. పవర్‌ప్లేలో ఎంతవరకు ఆధిపత్యం చెలాయించగలనో అంతవరకు చేయాలని అనుకున్నాను. మానిఫెస్టేషన్‌ను నేను నమ్ముతా. ఇతరులు నమ్ముతారో లేదో తెలియదు కానీ.. నేను మాత్రం గట్టిగా నమ్ముతాను. అది ఈ రోజు నిజమైంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను’ అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ పేసర్ ప్రఫుల్‌ హింగే చెప్పాడు.

‘నేను 13 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించాను. అప్పటికి లెదర్ బాల్ క్రికెట్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. 13 ఏళ్ల వయసులోనే క్లబ్‌లో చేరాలని నా తండ్రిని అడిగాను. నేను చిన్నవాడినని చెప్పి నాన్న 2-3 సార్లు నిరాకరించారు. కానీ ఎలాగోలా నాన్నను ఒప్పించా. అక్కడి నుంచి నా ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆడుతూనే వచ్చాను. ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడటం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డును నా కుటుంబానికి అంకితం చేస్తున్నా. ఎందుకంటే నా కోసం వారు చాలా త్యాగాలు చేశారు. నన్ను బాగా చూసుకున్నందుకు ఎంఆర్ఎఫ్‌కు ధన్యవాదాలు. ఫిజియో నవీన్ సర్ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. నేను ఈ స్థాయికి రావడానికి వారు కూడా కారణం. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని ప్రఫుల్‌ హింగే తెలిపాడు.

Exit mobile version