Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!

  • ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌ దారుణ ప్రదర్శన
  • ఐపీఎల్ చరిత్రలోనే ముంబై అరుదైన చెత్త రికార్డు
  • ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్సీలో మార్పులు
Mi Worst Record

Mi Worst Record

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌ (ఎంఐ) దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన చెత్త రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగిన రెండో జట్టుగా ముంబై నిలిచింది. ఈ జాబితాలో గతంలో పుణే వారియర్స్ ఇండియా మాత్రమే ఉంది. అప్పట్లో రాస్ టేలర్, ఏంజెలో మాథ్యూస్, ఆరోన్ ఫించ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ముంబైకి నాయకత్వం వహించడం గమనార్హం.

హార్దిక్ పాండ్యా గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవడంతో ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్సీలో మార్పులు చోటుచేసుకున్నాయి. హార్దిక్ గాయం కారణంగా ఒక మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించాడు. సూర్యకు కూతురు జన్మించడంతో.. మరో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ మళ్లీ జట్టులోకి వచ్చి కెప్టెన్సీ అందుకున్నాడు. అయితే కెప్టెన్ మారినా ముంబై పరిస్థితి మాత్రం మారలేదు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులే చేసింది. ప్రారంభం నుంచే ముంబై బ్యాటర్లు తీవ్ర ఒత్తిడిలో కనిపించారు. ర్యాన్ రికెల్టన్ (6), నమన్ ధీర్ (0), రోహిత్ శర్మ (15), సూర్యకుమార్ యాదవ్ (15)లు నిరాశపర్చారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి ముంబై 46/4తో కష్టాల్లో పడింది. తిలక్ వర్మ (20), హార్దిక్ పాండ్యా (26) రాణించలేదు. చివర్లో కార్బిన్ బోష్ 18 బంతుల్లో అజేయంగా 32 పరుగులు చేసి జట్టును గౌరవప్రదమైన స్కోర్‌కు చేర్చాడు. దాంతో ముంబై ఈ సీజన్‌లో మరోసారి నిరాశపరిచింది.