ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు పూర్తి ఆధిపత్యం చెలాయించాయి. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై, రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఐదేసి ట్రోఫీలు గెలుచుకున్నాయి. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‌లుగా చెన్నై, ముంబై నిలిచాయి. ఒకానొక సమయంలో ఈ రెండు టీమ్స్ ప్రత్యర్థులను బెంబేలెత్తించాయి. ఎంతలా అంటే.. మ్యాచ్ మొదలయ్యే ముందే ప్రత్యర్ధులు ఓటమిని ఒప్పుకునేవి. అయితే ఇప్పుడు సారథులుగా ధోనీ, రోహిత్ యుగం ముగిసింది. ఇద్దరు ఇప్పుడు ఆటగాళ్లుగా సేవలందిస్తున్నారు.
ఐపీఎల్ మొదటి సీజన్ 2008లోనే చెన్నై రన్నరప్‌గా నిలిచింది. 2010లో చెన్నై టైటిల్ గెలవగా.. ఆ సీజన్‌లో ముంబై రన్నరప్‌గా నిలిచింది. 2011లో విజేతగా నిలిచిన చెన్నై.. 2012లో రన్నరప్‌గా నిలిచింది. 2013లో ముంబై టైటిల్ గెలుచుకోగా.. చెన్నై రన్నరప్‌గా నిలిచింది. 2015లో ముంబై విజేతగా నిలవగా.. చెన్నై మరోసారి రన్నరప్‌గా నిలిచింది. 2017లో ముంబై ట్రోఫీ సాధించింది. 2018లో చెన్నై టైటిల్ గెలుచుకుంది. 2019లో ముంబై విజేతగా నిలవగా.. చెన్నై రన్నరప్‌గా ముగిసింది. 2020లో ముంబై ట్రోఫీ గెలుచుకోగా, 2021లో చెన్నై టైటిల్ సాధించింది. 2023లో చెన్నై మరోసారి చాంపియన్‌గా నిలిచి ట్రోఫీ ఖాతాలో వేసుకుంది. 2023 అనంతరం చెన్నై, ముంబైల హవా తగ్గిపోయింది.
Also Read: RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్ అనుమానమే!
చెన్నై జట్టు ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 12 సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇందులో 10 ఫైనల్స్ ఆడి.. 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకుంది. అంతేకాకుండా 2 చాంపియన్స్ ట్రోఫీలను కూడా ఖాతాలో వేసుకుంది. ముంబై టీమ్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో 8 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. ఇందులో 5 ఫైనల్స్ ఆడి.. 5 టైటిల్స్ గెలుచుకుంది. 2 చాంపియన్స్ ట్రోఫీలు కూడా సాధించింది. ధోనీ, రోహిత్ నాయకత్వంలో చెన్నై, ముంబై జట్లు ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేక యుగాన్ని సృష్టించాయి. ఇద్దరి దిగ్గజాల ఆధిపత్యం అభిమానుల మదిలో నిలిచిపోయింది.
