Rohit Sharma: ముంబై ఇండియన్స్‌ ఓటమికి కారణం రోహిత్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

  • బెంగళూరుపై ముంబై 18 పరుగుల తేడాతో ఓటమి
  • ముంబై ఓటమికి కారణం రోహిత్
  • రోహిత్ నిష్క్రమణతో గతి తప్పిన ముంబై ఇన్నింగ్స్
Rohit Sharma

Rohit Sharma

ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 222 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది. బెంగళూరు బ్యాటర్లు ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. ఫిల్ సాల్ట్ (78 పరుగులు; 36 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రజత్ పాటీదార్ (53 పరుగులు; 20 బంతుల్లో) మెరుపు అర్ధ శతకం చేయగా.. విరాట్ కోహ్లీ (50 పరుగులు; 38 బంతుల్లో) రాణించడంతో ఆర్సీబీ భారీ స్కోరును నమోదు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్ రికెల్టన్ (37 పరుగులు; 22 బంతుల్లో) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే జట్టు స్కోరు 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (19 పరుగులు; 13 బంతుల్లో) తొడ కండరాల గాయం కారణంగా ‘రిటైర్డ్ హర్ట్’గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. రోహిత్ నిష్క్రమణతో ముంబై ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. ఆ వెంటనే సుయాశ్ శర్మ వేసిన ఒకే ఓవర్లో రికెల్టన్, తిలక్ వర్మ (1) అవుట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది.

Also Read: Hardik Pandya: ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.. ముంబై ఓటములపై హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మధ్యలో సూర్యకుమార్ యాదవ్ (33 పరుగులు; 22 బంతుల్లో), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (40 పరుగులు; 22 బంతుల్లో ) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే రన్ రేట్ అంతకంతకు పెరిగిపోవడంతో ధాటిగా ఆడే క్రమంలో ఇద్దరు పెవిలియన్ చేరారు. నమన్‌ ధీర్‌ (1) కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఆఖర్లో రూథర్‌ఫర్డ్ (71 నాటౌట్; 31 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రూథర్‌ఫర్డ్ పోరాటం కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ కారణంగానే ముంబై ఓడిపోయిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.