Site icon NTV Telugu

MS Dhoni: గాయాలు ఉన్నా.. అభిమానుల కోసమే ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడు!

Ms Dhoni Csk

Ms Dhoni Csk

CSK Bowing Coach Eric Simons Hails MS Dhoni Batting: ఐపీఎల్‌ 2023 తర్వాత మోకాలికి శస్త్రచికిత్స జరిగినా, అప్పుడప్పుడు మళ్లీ నొప్పి తిరగబెడుతోన్నా.. అభిమానుల కోసమే ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్‌ కోచ్‌ ఎరిక్ సిమన్స్‌ తెలిపాడు. ప్రతిసారి ధోనీ తన బ్యాటింగ్‌తో తమని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడని, మహీతో దగ్గరగా ఉండి పనిచేయడం అద్భుతం అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో ధోనీ క్రీజులోకి వచ్చాడంటే.. సిక్సులు బాదుతూ అభిమానులను అలరిస్తున్నాడు. విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 37 పరుగులు చేసిన ధోనీ.. ముంబై ఇండియన్స్‌పై 4 బంతుల్లో 20 రన్స్ చేశాడు.

వైజాగ్‌ మ్యాచ్‌ అనంతరం ఎంఎస్ ధోనీ తన కాలికి ప్రత్యేకమైన పట్టీతో కనిపించాడు. అపుడప్పుడు వచ్చే నొప్పిని భరిస్తూనే ముంబై ఇండియన్స్‌పై హిట్టింగ్‌ చేశాడు. ఇదే విషయంపై చెన్నై బౌలింగ్‌ కోచ్‌ ఎరిక్ సిమన్స్‌ మాట్లాడుతూ… ‘ముంబై బౌలింగ్‌ను చూసి మా స్కోరు 200ల్లోపే ఉంటుందనుకున్నా. ధోనీ బ్యాటింగ్‌తో 206 పరుగులకు చేరాం. ప్రతిసారి అతడు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడు. మహీతో దగ్గరగా ఉండి పనిచేయడం అద్భుతం. క్రీజ్‌లోకి వెళ్లడంతోనే సిక్స్‌ బాదడం అంత సులువేం కాదు. అప్పటికే వికెట్‌ తీసి ఉత్సాహం మీదున్న బౌలర్ (హార్దిక్) ఆటలు ధోనీ ముందు సాగలేదు. నెట్స్‌లో మహీ ప్రాక్టీస్‌ను చూస్తే అసాధారణంగా ఉంటుంది. ప్రాక్టీస్‌లోనిదే మైదానంలో అమలు చేస్తాడు. అందుకే అతడిని మా బ్యాటింగ్ వ్యూహంలో భాగంగా వాడుకుంటున్నాం’ అని అన్నాడు.

Also Read: Preity Zinta: ఆస్తులు అమ్మైనా సరే.. రోహిత్‌ శర్మను దక్కించుకుంటా: ప్రీతీ జింటా

‘డెత్‌ ఓవర్లలో ఎలా బౌలింగ్‌ చేయాలో ధోనీ ఆటను చూసి నేర్చుకుంటున్నాం. సీజన్‌కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మా ప్లాన్లను మహీపైనే ప్రయోగించాం. అది పనికొస్తుంది. ఐపీఎల్‌ 2023 తర్వాత ధోనీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడప్పుడు మళ్లీ ఆ గాయం తిరగబెడుతోంది. అయినా సరే అభిమానుల కోసం ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇప్పటివరకు నేను చూసిన క్రికెటర్లలో అతడు అరుదైన వ్యక్తి. ఆడాలనుకుంటే నొప్పిని పట్టించుకోకుండా బరిలోకి దిగుతాడు. ఇబ్బంది పడినా జట్టుకు ఏమీ అవసరం, ఏం చేయాలనే దానిపై మహీకి స్పష్టత ఉంది’ అని ధోనీపై ఎరిక్ ప్రశంసలు కురిపించాడు.

Exit mobile version