Site icon NTV Telugu

Dhruv Jurel: నేను భారత జట్టులో ఆడుతోంది ఆయన కోసమే: ధ్రువ్ జురెల్

Dhruv Jurel Father

Dhruv Jurel Father

తాను భారత జట్టులో ఆడుతోంది తన తండ్రి కోసమే అని టీమిండియా యువ క్రికెటర్, రాజస్థాన్‌ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురెల్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌పై చేసిన హాఫ్‌ సెంచరీ తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. లక్నోపై 34 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సులతో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. జురెల్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. ఐపీఎల్ 2024కు ముందు జురెల్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ చేసిన ధ్రువ్ జురెల్.. భావోద్వేగంతో మైదానంలో ఒకరికి సెల్యూట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ అనంతరం ధ్రువ్ జురెల్ మాట్లాడుతూ… ‘నాకు అవకాశం దొరికినప్పుడల్లా మ్యాచ్‌ని ముగించాలని అనుకుంటాను. మిడిలార్డర్‌లో ఆడటం వల్ల మరింత బాధ్యత ఉంటుంది. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి నా జట్టుకు విజయాన్ని అందించాలనుకున్నా. పవర్‌ ప్లేలో ఇద్దరు మాత్రమే సర్కిల్ అవతల ఉంటారు. సులువుగా పరుగులు వస్తాయి. కానీ మిడిల్‌ ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లను దాటి బంతిని బౌండరీకి పంపాలి. ఇందుకు టెక్నిక్‌తో పాటు టైమింగ్ ముఖ్యం’ అని అన్నాడు.

Also Read: Anchor Lasya: యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం!

‘నేను బాగానే ఆరంబించా. అయితే నేను కొట్టిన బంతులు నేరుగా ఫీల్డర్ల వద్దకే వెళ్లాయి. ఆ సమయంలో సంజూ శాంసన్ ధైర్యం చెప్పాడు. మరీ ఎక్కువగా బాదకుండా టైమింగ్‌తో ఆడమని చెప్పాడు. ఆపై ఒకే ఓవర్‌లో 20 పరుగులు చేయడంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. నేను భారత జట్టులో ఆడుతోంది నా తండ్రి కోసమే. మా కోసం ఎన్నో కష్టాలను ఆయన ఎదుర్కొన్నారు. భారత్ తరఫున టెస్టుల్లో ఆడేటప్పుడు నాతో పాటు లేరు. ఆ సమయంలో ఆర్మీ విధుల్లో ఉన్నారు. ఈరోజు హాఫ్‌ సెంచరీ చేసిన సమయంలో నాతోనే ఉండటం చాలా ఆనందంగా ఉంది. అర్ధ శతకం చేసిన తర్వాత నాన్నకే సెల్యూట్‌ చేస్తూ సంబరాలు చేసుకున్నా’ అని ధ్రువ్ జురెల్ చెప్పాడు.

Exit mobile version