KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!

  • ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ కమ్‌బ్యాక్‌
  • వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి కేకేఆర్
  • కేకేఆర్ ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే
Kkr Playoffs Scenario Ipl 2026

Kkr Playoffs Scenario Ipl 2026

KKR Playoffs Scenario in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అద్భుతమైన కమ్‌బ్యాక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సీజన్ ఆరంభంలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేకేఆర్.. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి అనూహ్యంగా దూసుకొచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకున్న కోల్‌కతా.. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిస్తే టాప్-4లోకి ఎంట్రీ ఇచ్చే స్థితిలో ఉంది.

శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ)పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించి తమ నెట్ రన్‌రేట్‌ను కూడా భారీగా మెరుగుపర్చుకుంది. ముందుగా వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్‌ల స్పిన్ త్రయం ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేసింది. అనంతరం ఫిన్ అలెన్ 47 బంతుల్లో అద్భుత శతకం బాది జట్టుకు సునాయాస విజయం అందించాడు.

సీజన్ ప్రారంభంలో కేకేఆర్ వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న సమయంలో కెప్టెన్ అజింక్య రహానే పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టును సరైన దారిలో నడిపించలేకపోతున్నాడని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అనుభవజ్ఞుడైన రహానే ఒత్తిడిని ఎదుర్కొంటూ జట్టును తిరిగి గాడిలో పెట్టాడు. ఇప్పుడు కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచడంలో అతడి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేకేఆర్.. ఊహించని రీతిలో ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. అందరికంటే ముందుగా ఇంటిదారి పడుతుందనుకున్నా.. అద్భుత ఆటతో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం అందరి దృష్టి కేకేఆర్ ప్లేఆఫ్స్ సమీకరణాలపైనే ఉంది.

ఐపీఎల్‌లో 10 జట్లు ఉన్న విషయం తెలిసిందే. 16 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించిన జట్లు సాధారణంగా నెట్ రన్‌రేట్‌తో సంబంధం లేకుండానే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం కేకేఆర్‌కు 9 పాయింట్స్ ఉండగా.. పట్టికలో 7వ స్థానంలో ఉంది. లీగ్ దశలో ఇంకా నాలుగు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే.. మొత్తం 17 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఒక మ్యాచ్‌లో ఓడినా పరిస్థితి మారిపోతుంది. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే కేకేఆర్‌కు ప్రతి మ్యాచ్ ఇప్పుడు ‘డూ ఆర్ డై’గా మారింది.

కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ను మే 13న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ప్లేఆఫ్స్ రేసులో కేకేఆర్ మరింత బలంగా నిలబడటమే కాకుండా టాప్-4 కోసం పోటీ పడుతున్న ఇతర జట్లపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో కేకేఆర్ మ్యాచులు ఆడాల్సి ఉంది. ఐపీఎల్ 2026లో దుమ్మురేపుతున్న గుజరాత్, బెంగళూరుపై విజయాలు అంత ఈజీ కాదు. చూడాలి మరి కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు చేరుతుందో లేదో.