Site icon NTV Telugu

Josh Hazlewood: వైభవ్ సూర్యవంశీ దెబ్బకు అల్లాడిపోయా.. లక్నోపై మంచి రిథమ్ అందుకున్నా!

Josh Hazlewood Bowling

Josh Hazlewood Bowling

ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌ (ఎల్ఎస్‌జీ)పై రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన హేజిల్‌వుడ్‌ను ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. అవార్డు అందుకున్న ఈ ఆసీస్ స్టార్ మ్యాచ్ అనంతరం తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గత కొన్ని నెలలు తనకు కాస్త కష్టంగా గడిచాయని, అయితే గత మ్యాచ్‌లో (రాజస్థాన్‌ రాయల్స్) తన రిథమ్‌ను కాస్త తిరిగి అందుకున్నానని తెలిపాడు. ఆర్ఆర్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ దెబ్బకు అప్పటివరకూ ఉన్నవన్నీ చెల్లాచెదురయ్యాయని చెప్పాడు. ఎల్ఎస్‌జీ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా అనిపించిందని, ఇప్పుడు తన బౌలింగ్ రిథమ్ మంచి స్థితిలో ఉందని హేజిల్‌వుడ్‌ చెప్పాడు.

‘గత కొన్ని నెలలు నాకు దీర్ఘ ప్రయాణంలా అనిపించాయి. అయితే రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కొంత రిథమ్ తిరిగి వచ్చింది. వైభవ్ సూర్యవంశీ బాగా ఆడాడు. అతడు ఉన్నంతసేపు లయ తప్పాను. ఈరోజు మాత్రం చాలా బాగుంది. నా బౌలింగ్ రిథమ్ మంచి స్థితిలో ఉంది. సరైన లెంగ్త్ బంతులు వేయాలంటే.. చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరితో ఆడుతున్నారో, ప్రత్యర్థి బ్యాటర్లు ఎవరన్నది, అలాగే పిచ్ పరిస్థితులు కూడా కీలకంగా ఉంటాయి. ఈరోజు పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. కొంచెం బౌన్స్ కూడా ఉంది. అందుకే సరైన లెంగ్త్‌లో బంతులు వేస్తూ ఫలితం సాధించా’ అని జోష్ హేజిల్‌వుడ్ చెప్పాడు.

‘ఈ విజయంలో జట్టులోని ప్రతి ఒక్కరి కృషి ఉంది. ప్రతి బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నేను టెస్ట్ బౌలర్ కావడంతో స్లోవర్ బాల్స్ వంటి వెరైటీ డెలివరీలు వేయడం కొంచెం కష్టం. అయినప్పటికీ వాటిపై పని చేస్తూనే ఉన్నాను. స్లో డెలివరీలు నా ఆయుధాల్లో భాగంగా ఉంచుకోవాలి. భువనేశ్వర్ కుమార్‌తో నేను ఎప్పటికప్పుడు చర్చిస్తుంటా. మా బౌలింగ్ యూనిట్ మొత్తం మ్యాచ్ పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుని మైదానంలో చర్చలు చేస్తాం. ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తాం. అదే మాకు పెద్ద ప్లస్ పాయింట్. రసిఖ్ సలామ్ దార్ మొదటి కొన్ని మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. ఇటీవల మ్యాచ్‌ల్లో వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. అతడు ప్రాక్టీస్‌లో చాలా కష్టపడుతున్నాడు. అతనికి మంచి నైపుణ్యాలు ఉన్నాయి. కఠినమైన ఓవర్లు కూడా బాగా వేస్తున్నాడు. ఈ టోర్నమెంట్ అతనికి చాలా కీలకం. ఐపీఎల్ 2026లో సాధ్యమైనంత వరకు ఆడుతా. ముందున్న షెడ్యూల్ కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి నేను వరుసగా మ్యాచ్‌లు ఆడగలనని ఆశిస్తున్నాను’ అని హేజిల్‌వుడ్ తెలిపాడు.

 

 

Exit mobile version