Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!

  • ఐపీఎల్ 2026లో బెంబేలెత్తిపోతున్న బుమ్రా
  • బుమ్రా కెరీర్‌లో గడ్డు రోజులు
  • 58 పరుగులు సమర్పించుకున్న బుమ్రా
Jasprit Bumrah

Jasprit Bumrah

Jasprit Bumrah Worst T20 Spells: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బూమ్ బూమ్ తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ వికెట్స్ పడగొడుతాడు. తన యార్కర్లు, స్లోవర్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పే బుమ్రా.. టీ20 ఫార్మాట్‌లో అత్యంత నమ్మకమైన బౌలర్లలో ఒకడు. అయితే ప్రతి బౌలర్ కెరీర్‌లో కొన్ని గడ్డు రోజులు ఉంటాయి. ఆ గడ్డు కాలం ఇప్పుడు బుమ్రాకు నడుస్తోంది. ఐపీఎల్ 2026లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఇటీవలి రోజుల్లో వికెట్స్ తీయకపోగా.. భారీగా రన్స్ సమర్పించుకుంటున్నాడు.

టీ20ల్లో న్యూజిలాండ్‌పై జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా పరుగులు ఇచ్చాడు. 2026లో తిరువనంతపురంలో జరిగిన ఆ మ్యాచ్‌లో వికెట్ తీయకుండా 58 పరుగులు సమర్పించుకున్నాడు. ఇదే బుమ్రా కెరీర్‌లో అత్యంత ఖరీదైన స్పెల్‌. తాజాగా ముంబై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 54 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 55 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అదే ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 52 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేదు.

ఐపీఎల్ 2026లో జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లే తీశాడు. 132 సగటు, 8.8 ఎకానమీ నమోదు చేశాడు. బుమ్రా తన ఐపీఎల్‌ కెరీర్లోనే ఎన్నడూ ఇంతటి పేలవ ప్రదర్శన చేయలేదు. ఈ గణాంకాలు చూస్తే.. ఎంత గొప్ప బౌలర్ అయినా కొన్ని మ్యాచ్‌ల్లో తేలిపోతాడని అర్ధమవుతోంది. టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిన నేపథ్యంలో బౌలర్లకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ తన అనుభవంతో మళ్లీ బలంగా పుంజుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.