Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్‌తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi Breaks

Vaibhav Sooryavanshi Breaks

Vaibhav Sooryavanshi: నిన్న (శుక్రవారం) ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఐపీఎల్ ప్రయాణం అత్యంత విషాదకరంగా ముగిసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆ ఓటమి తాలూకు బాధ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముఖంలో స్పష్టంగా కనిపించింది. గుజరాత్ విజయం ఖరారైన కొన్ని నిమిషాలకే.. వైభవ్ రాజస్థాన్ డగౌట్‌లో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనలో తాను బాధ పడుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. మొదట తన ఆరెంజ్ క్యాప్‌తో కన్నీళ్లను దాచుకునే ప్రయత్నం చేసిన ఈ బుడ్డోడు, ఆ తర్వాత ఓటముని తట్టుకోలేక ముఖానికి టవల్ అడ్డుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ ఒత్తిడితో కూడిన నాకౌట్ మ్యాచ్‌లోనూ వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తీవ్ర నిరాశే మిగిలింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 97 పరుగులతో చెలరేగిన వైభవ్, గుజరాత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ భయం లేని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడినప్పటికీ, ఈ టీనేజ్ సంచలనం ఎదురుదాడికి దిగి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఒక దశలో రాజస్థాన్ తక్కువ పరుగులకే కుప్పకూలేలా కనిపించినా, వైభవ్ మిడిల్ ఓవర్లలో గేర్ మార్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం వణకకుండా సంయమనం పాటిస్తూ గుజరాత్ బౌలింగ్ అటాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే, 18వ ఓవర్లో కాగిసో రబడా వేసిన షార్ట్ డెలివరీకి వైభవ్ అవుటయ్యాడు. కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక, వైభవ్ ఆడిన చివరి నాలుగు ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ మార్కును తృటిలో చేజార్చుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కేవలం నాలుగు పరుగుల తేడాతో మరోసారి వంద పరుగుల మైలురాయిని అందుకోలేకపోయిన బాధ అతని ముఖంలో స్పష్టంగా తెలిసింది. దాంతో ఎంతో నిరాశగా, నెమ్మదిగా అతను మైదానాన్ని వీడాడు.

×
×
Ad