శ్రీలంక క్రికెట్ ఇప్పటికే పరిపాలనాపరమైన మార్పులతో సతమతమవుతుండగా, తాజాగా అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు యువ క్రీడాకారులు చేసిన పని ఆ దేశ క్రీడారంగానికి తీరని మచ్చ తెచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన క్రీడాకారులు, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
కొలంబోలోని నారాహెన్‌పిటా ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌లో బస చేసిన ఇద్దరు శ్రీలంక అండర్-19 పురుషుల క్రికెటర్లు, హోటల్‌లోని ఇతర అతిథులు స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. హోటల్‌లో ఉంటున్న మహిళలు, తాము స్నానం చేస్తుండగా తమను మొబైల్ ఫోన్ల ద్వారా వీడియో తీస్తున్నారని గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కోర్టు విచారణ..
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపి.. ఈ వారం మొదట్లో ఆ ఇద్దరు క్రికెటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అలుత్కాడె మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఒక్కొక్కరికి 5,00,000 శ్రీలంక రూపాయల (సుమారు 1,564 డాలర్లు) వ్యక్తిగత బాండ్లపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మే 25న జరగనుంది.
పోలీసుల దర్యాప్తు..
నారాహెన్‌పిటా పోలీసులు ప్రస్తుతం ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. ముఖ్యంగా సదరు క్రీడాకారులు చిత్రీకరించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లోగానీ లేదా ఇతరులకు గానీ షేర్ చేశారా అనే కోణంలో ఫోరెన్సిక్ తనిఖీలు చేస్తున్నారు.
శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందన..
ఈ వివాదంపై శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఇంకా ఎలాంటి అధికారిక క్రమశిక్షణ చర్యలను ప్రకటించలేదు. అయితే.. గత 48 గంటల్లో బోర్డులో భారీ మార్పులు జరగడం విశేషం. పాత ఆఫీస్ బేరర్లను తొలగించి, వారి స్థానంలో ఒక ‘ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ’ని నియమించారు. ఈ పరిపాలనాపరమైన మార్పుల నేపథ్యంలో, నిందితులైన ఆటగాళ్లపై బోర్డు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.
సాధారణంగా అండర్-19 స్థాయిలో ఉన్న క్రీడాకారులకు భవిష్యత్తులో జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి నేరారోపణలు ఎదుర్కోవడం వల్ల వారి కెరీర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. గతంలో కూడా పలువురు శ్రీలంక క్రికెటర్లు క్రమశిక్షణా రాహిత్యం వల్ల నిషేధానికి గురయ్యారు. తాజా ఘటనతో క్రీడాకారుల ప్రవర్తనా నియమావళిని మరింత కఠినతరం చేయాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
