Sanju Samson: నిన్న (గురువారం) వాంఖడే స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్(MI)ను 103 పరుగుల తేడాతో ఓడించింది. ఇక చెన్నై తరఫున సంజు శామ్సన్ దుమ్మురేపేశాడు. సంజూ (54 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీ సాధించగా సీఎస్‌కే 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై ఇంత చిత్తుగా ఓటమిపాలవ్వడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన సంజూ మాట్లాడాడు.
తన జీవితంలో వాంఖడేలో ఇంత పెద్ద మొత్తంలో సీఎస్‌కే ఫ్యాన్స్‌ను ఎప్పుడూ చూడలేదన్నాడు. ఈ ఫ్రాంచైజీకి ఆడటం గర్వంగా ఉందని చెప్పాడు. ఇక తన బ్యాటింగ్ గురించి వివరిస్తూ.. ప్రస్తుతం తాను ఆటను చాలా సింపుల్‌గా చూస్తున్నానని, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే తన విజయరహస్యమని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో వికెట్ సాధారణ వాంఖడే పిచ్ లాగా లేదని, బంతి స్వింగ్ అవ్వడమే కాకుండా కాస్త ఆగుతూ వస్తోందని గ్రహించినట్లు పేర్కొన్నాడు. పవర్‌ప్లే ముగిసిన వెంటనే పిచ్ స్వభావాన్ని అంచనా వేసిన సంజూ, వికెట్లు పడుతున్న సమయంలో బాధ్యతాయుతంగా ఆడాలని నిర్ణయించుకున్నాడు. “ముందే ఒక మైండ్‌సెట్‌తో రాకుండా, క్రీజులోకి వెళ్ళాక పరిస్థితులను బట్టి ఆడటం ముఖ్యం. జట్టులో సీనియర్‌గా, కెప్టెన్‌గా నా బాధ్యతను గుర్తించాను. ఒకవేళ వికెట్లు పడకుండా ఉండి ఉంటే ఇంకాస్త ముందుగానే దూకుడుగా ఆడేవాడిని. కానీ వికెట్లు పడుతున్న తరుణంలో ఒక సెటిల్డ్ బ్యాటర్ చివరి వరకు ఉండటం అవసరం, అదే నేను చేశాను” అని వివరించాడు. టోర్నీలో వరుసగా మూడు ఓటముల తర్వాత కూడా జట్టులోని యువ ఆటగాళ్లు చూపిన తెగువను సంజూ ప్రశంసించాడు. యువకులతో కూడిన ఈ జట్టులో ఆత్మవిశ్వాసం మెండుగా ఉందని, ఇదే జోరును మున్ముందు సైతం కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ప్రతి మ్యాచ్ కీలకమని, ప్రత్యర్థులు సవాల్ విసిరినప్పుడు దానికి తగ్గట్టుగా సిద్ధంగా ఉంటూ ఆటను ఆస్వాదించడమే తమ తదుపరి లక్ష్యమని సంజూ స్పష్టం చేశాడు.
