Vaibhav Sooryavanshi: యూనివర్స్‌ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్‌ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!

Vaibhav Sooryavanshi Sanjiv

Vaibhav Sooryavanshi Sanjiv

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో రికార్డులను తిరగరాసి.. యూనివర్స్‌ బేబీ బాస్‌గా మారిపోయాడు.. అయితే, వైభవ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) యజమాని సంజీవ్ గోయెంకా చేసిన భావోద్వేగభరితమైన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకప్పుడు స్టేడియంలో ప్రేక్షకుడిగా మ్యాచ్‌లు వీక్షించిన బాలుడు, నేడు ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం తనకు ఎంతో గర్వంగా ఉందంటూ గోయెంకా ప్రశంసలు కురిపించారు.

సంజీవ్ గోయెంకా తన సోషల్ మీడియా ఖాతాలో వైభవ్ చిన్ననాటి ఫొటోను పంచుకుంటూ అతని అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తు చేశారు. ఆ ఫోటోలో చిన్న వయసులో ఉన్న వైభవ్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ జట్టుకు మద్దతుగా స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షిస్తున్నాడు. ఈ ఫోటో 2017 మే 3న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా తీసినదిగా తెలుస్తోంది.

×
×
Ad

ఈ సందర్భంగా గోయెంకా తన పోస్టులో, “తొమ్మిదేళ్ల క్రితం అతను రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్‌కు మద్దతు ఇస్తూ స్టాండ్స్‌లో కూర్చున్నాడు. నేడు ఐపీఎల్ 2026ను ఆరెంజ్ క్యాప్ విజేతగా ముగించాడు. ఇది నిజంగా అద్భుతమైన ప్రయాణం. స్టాండ్స్‌లోని ఒక చిన్న అభిమాని ఇప్పుడు ఈ సీజన్‌లో అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. భారత జట్టులో కూడా అతను మరిన్ని మైలురాళ్లు చేరుకుంటాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇలాగే కొనసాగించు వైభవ్… నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.

సంజీవ్ గోయెంకా యాజమాన్యంలో ఉన్న రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ జట్టు 2016, 2017 సీజన్లలో ఐపీఎల్‌లో పాల్గొంది. స్టీవ్ స్మిత్ సారథ్యంలో ఆడిన ఆ జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ కూడా సభ్యుడిగా ఉన్నాడు. 2017లో ఆ జట్టు మ్యాచ్‌ను ప్రేక్షకుడిగా వీక్షించిన వైభవ్, తొమ్మిదేళ్ల తర్వాత అదే ఐపీఎల్ వేదికపై స్టార్‌గా నిలవడం విశేషంగా మారింది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అతని స్ట్రైక్‌రేట్ 237.30గా ఉండగా, మొత్తం 72 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.

కేవలం ఆరెంజ్ క్యాప్ గెలవడమే కాకుండా, “ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్”, “మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్”, “సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్”, “సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్” వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కూడా వైభవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరుకోలేకపోయినప్పటికీ, వైభవ్ తన బ్యాటింగ్‌తో టోర్నమెంట్ మొత్తాన్ని శాసించాడు. ముఖ్యంగా క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఒకప్పుడు స్టాండ్స్‌లో కూర్చుని ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించిన బాలుడు, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్‌లో అత్యంత ప్రకాశవంతమైన యువ తారగా ఎదగడం భారత క్రికెట్‌కు గొప్ప సంకేతంగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారతాడనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.