Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..

Riyan Parag Vaping

Riyan Parag Vaping

Riyan Parag Vaping Controversy: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మంగళవారం న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా, రాజస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో పరాగ్ ‘వేపింగ్’ (Vaping) చేస్తూ కెమెరాకు చిక్కాడు. అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇప్పుడు ఈ వివాదం పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో ఈ దృశ్యం వెలుగులోకి వచ్చింది. కేవలం 16 బంతుల్లో 29 పరుగులు చేసి, కీలక సమయంలో అవుట్ అయి డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న పరాగ్.. అక్కడ వేప్ ఉపయోగిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్ లేదా డగౌట్స్‌లో పొగాకు లేదా దానికి సంబంధించిన ఉత్పత్తులను వాడటంపై కఠిన నిషేధం ఉంది. బీసీసీఐ (BCCI) క్రమశిక్షణ మార్గదర్శకాల ప్రకారం పరాగ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. సంజూ శామ్సన్‌ను చెన్నై దక్కించుకోవడంతో ఈ సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన 24 ఏళ్ల పరాగ్, ఇప్పటికే తన బ్యాటింగ్ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 81 పరుగులే చేయడం గమనార్హం. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ సైతం నిబంధనల ఉల్లంఘన కారణంగా చిక్కుల్లో పడ్డారు. ఏప్రిల్ 10న గువహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు గాను అతనికి రూ. 1 లక్ష జరిమానా విధించారు. బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) ఇప్పటికే అతనికి షోకాజ్ నోటీసు జారీ చేసి, 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ తరహా వరుస వివాదాలు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి. మైదానంలో పంజాబ్ కింగ్స్‌పై 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, వారికి ఈ సీజన్‌లో మొదటి ఓటమిని రుచి చూపినప్పటికీ.. వెలుపల జరుగుతున్న ఈ పరిణామాలు జట్టు ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ హోదాలో ఉన్న వ్యక్తి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.