RCB vs GT Final: ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరో మహా సంగ్రామానికి తెర లేవబోతోంది. ఆదివారం (మే 31) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇరు జట్లూ తమ రెండో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉండటంతో ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా రెండో ఏడాది సైతం కప్పును కైవసం చేసుకోవాలని బెంగళూరు జట్టు చూస్తోంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) జట్లు మాత్రమే ఇలా బ్యాక్ టు బ్యాక్ టైటిళ్లను గెలుచుకున్నాయి. ఇప్పుడు ఆ అరుదైన రికార్డుపై ఆర్సీబీ కన్నేసింది. మరోవైపు ఐదేళ్లలోనే రెండో టైటిల్ కొట్టాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. గతంలో 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ తొలి ట్రోఫీని గెలిచింది. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో గనుక గుజరాత్ గెలిస్తే.. ఇద్దరు వేర్వేరు కెప్టెన్ల ఆధ్వర్యంలో మొదటి రెండు ట్రోఫీలు సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. విశేషం ఏంటంటే.. ఈ రెండు జట్లు సైతం తమ కెరీర్‌లో మొదటి ఐపీఎల్ ట్రోఫీలను ఈ అహ్మదాబాద్ వేదికపైనే గెలుచుకున్నాయి. ఇప్పుడు రెండో ట్రోఫీని కూడా ఇదే మైదానంలో అందుకోబోతుండటం గమనార్హం.
ఐపీఎల్ చరిత్రలో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడిన జట్లే.. ఫైనల్‌లోనూ తలపడటం 16 సీజన్లలో ఇది 13వ సారి. గత ఏడు సీజన్లుగా మొదటి క్వాలిఫైయర్ గెలిచిన జట్టునే టైటిల్ వరిస్తూ వస్తోంది. ఈ సీజన్ ఫైనల్‌కు చేరడానికి ముందు ఇరు జట్లు మూడుసార్లు తలపడగా.. రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ, ఒక మ్యాచ్‌లో జీటీ విజయం సాధించాయి. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఇది వీటికి నాలుగో మ్యాచ్. అయితే గుజరాత్ జట్టు గెలిచిన ఆ ఒక్క మ్యాచ్ ఈ అహ్మదాబాద్ వేదికపైనే కావడం విశేషం. ఈ సీజన్‌లో గుజరాత్ జట్టుకు స్వదేశీ మైదానంలో తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు మ్యాచ్‌లను గిల్ సేన సొంతం చేసుకుంది. మరోవైపు.. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో బెంగళూరు, గుజరాత్ జట్లు తలపడటం ఇదే మొదటిసారి. గుజరాత్ టైటాన్స్‌కు ఇది మూడో ఫైనల్ (గతంలో 2022, 2023 లో చేరింది). రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది ఐదో ఫైనల్ మ్యాచ్. అంతకుముందు ఆర్సీబీ 2009, 2011, 2016, 2025 లలో ఫైనల్స్ ఆడింది.
ఇక, రేపటి తుది పోరుకు ముందు, ఇరు జట్ల హెడ్-టు-హెడ్ (ముఖాముఖి) రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఇరు జట్లు మొత్తం 9 సార్లు తలపడగా, అందులో 5 మ్యాచ్‌ల్లో బెంగళూరు, 4 మ్యాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించాయి. అహ్మదాబాద్ మైదానంలో ఇరు జట్లు 2 సార్లు తలపడగా.. చెరో మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా నిలిచాయి. ఐపీఎల్ 2026 సీజన్ విషయానికొస్తే.. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 2, జీటీ 1 గెలిచాయి. అలాగే ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఈ రెండు జట్లు ఒకే ఒక్కసారి తలపడగా, ఆ మ్యాచ్‌లో బెంగళూరు జట్టుదే పైచేయి అయింది. ఇదిలా ఉండగా.. రేపటి మహా మ్యాచ్‌ను మైదానంలో వీక్షించేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ పోరులో గిల్ సేన హోమ్ గ్రౌండ్ సెంటిమెంట్‌ను కాపాడుకుంటుందో, లేక డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ మరోసారి జయకేతనం ఎగురవేస్తుందో చూడాలి.
