Parthiv Patel: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-2 మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసుపై జరుగుతున్న చర్చలకు గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్ పటేల్ బ్రేక్ వేశారు. ప్రస్తుత సీజన్‌లో కేవలం 15 మ్యాచ్‌ల్లోనే 242.86 స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన వైభవ్ వయసు గురించి మాట్లాడటం ఆపేసి, అతని ఆటతీరుపై మాత్రమే దృష్టి పెట్టాలని పార్థివ్ హితవు పలికారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి రాజస్థాన్‌ను క్వాలిఫైయర్-2 కు చేర్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వైభవ్ వయసుపై మళ్లీ వివాదాలు చెలరేగాయి. గతంలో అతని తండ్రి సైతం ఏజ్ ఫ్రాడ్ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఈ క్రమంలోనే కోల్‌కతా నైట్ రైడర్స్ పవర్ కోచ్ ఆండ్రీ రస్సెల్ సైతం ఈ వివాదాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేయగా, తాజాగా పార్థివ్ పటేల్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పార్థివ్ మాట్లాడుతూ.. “వైభవ్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. మనం అతని వయసు గురించి అస్సలు మాట్లాడకూడదు, ఆ చర్చకు ఇక్కడితో స్వస్తి పలకాలి. అతను అసాధారణమైన ప్రతిభావంతుడు. అయితే, ప్రత్యర్థి జట్టుగా రేపటి మ్యాచ్‌లో అతను అంతగా రాణించకూడదనే మేము కోరుకుంటున్నాం” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అయితే.. ప్రస్తుతానికి గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్‌కు తిరుగులేని రికార్డు ఉంది. గతంలో గుజరాత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 56 సగటుతో 168 పరుగులు చేశాడు. ఇందులో కేవలం 35 బంతుల్లోనే కొట్టిన నాటౌట్ 101 పరుగుల సెంచరీ సైతం ఉంది. ఈ నేపథ్యంలో క్వాలిఫైయర్-2 లో అతడిని ఎలా కట్టడి చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు పార్థివ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “సార్, నేనేమీ బ్రాడ్‌కాస్టర్‌ని కాదు, స్టార్ స్పోర్ట్స్ ప్రీ-షోలోనూ కూర్చోలేదు. కాబట్టి మా ప్లాన్స్ ఏంటో నేను మీకు ముందే చెప్పలేను. అతని బ్యాటింగ్ నాకు నచ్చినప్పటికీ, రేపు మాత్రం అతడిని త్వరగా అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మిగతా జట్లలాగే మేము సైతం అతని వీడియోలు చూసి కొన్ని వ్యూహాలు సిద్ధం చేసుకున్నాం. ఆ ప్లాన్స్‌ను గ్రౌండ్‌లో సరిగ్గా అమలు చేస్తామని ఆశిస్తున్నాం. మా వ్యూహాలు ఏంటో రేపు మీకే మైదానంలో తెలుస్తాయి. గ్రౌండ్‌లో చూయిస్తాం” అని పార్థివ్ పటేల్ స్పష్టం చేశారు.
