Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..

Sachin Tendulkar Tweet

Sachin Tendulkar Tweet

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సైతం చాలా సులువుగా ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ పాట్ కమిన్స్‌తో కూడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను వైభవ్ ముక్కలు చేశాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు.

వైభవ్ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్‌కు ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్ కూడా ఫిదా అయిపోయాడు. సచిన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “వైభవ్ బ్యాట్ తిప్పే విధానం అద్భుతంగా ఉంది. బంతిని బాదడానికి అతను కాళ్లను జరుపుకుంటూ స్పేస్ క్రియేట్ చేసుకునే విధానం మరీ బాగుంది. అందుకే అతను ఇంత స్వేచ్ఛగా ఆడగలుగుతున్నాడు. అతని ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం” అని ప్రశంసించారు.

×
×
Ad

మ్యాచ్ ముగిసిన తర్వాత సచిన్ చేసిన ట్వీట్ గురించి వైభవ్‌కు తెలియగా.. అతను ఎంతో సంతోషపడ్డాడు. “సార్, ఇది నాకు ఎంతో గర్వకారణం. ఈ విషయం నాకే తెలీదు, మీరే చెప్పారు. సచిన్ సర్ క్రికెట్ దేవుడు. అలాంటి లెజెండ్ నా గురించి ట్వీట్ చేయడం చాలా పెద్ద విషయం. ఇది నాకు మరింత పట్టుదలను ఇస్తుంది” అని వైభవ్ ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, వైభవ్ (97), ధ్రువ్ జురెల్ (50) రాణించడంతో 243 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్‌లను అతను త్వరగా అవుట్ చేశాడు. దీంతో హైదరాబాద్ 196 పరుగులకే ఆలౌట్ అయింది. 47 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ క్వాలిఫైయర్-2కు దూసుకెళ్లగా, సన్‌రైజర్స్ టోర్నీ నుండి నిష్క్రమించింది.