IPL 2026: ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే హీరోలు.. ఆ తర్వాత పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిన 5 గురు ‘వన్ మ్యాచ్ వండర్స్’!

Ipl

Ipl

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితమైన చివరి అంకానికి చేరుకుంది. ఆర్‌సీబీ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరగా.. మిగిలిన ఆరు జట్లు ఇంటిదారి పట్టాయి. మే 31 ఆదివారం రాత్రి జరిగే ఫైనల్‌తో ఈ 19వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ లీగ్ స్టేజ్‌లో వైభవ్ సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్, భువనేశ్వర్ స్వింగ్, కోహ్లీ మాస్టర్ క్లాస్, రబాడ స్పీడ్ అభిమానులను అలరించినప్పటికీ.. కొందరు ఆటగాళ్లు మాత్రం కేవలం ‘ఒక్క మ్యాచ్ వండర్స్’ లాగే మిగిలిపోయారు. ఒకే ఒక్క మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, ఆ తర్వాత ఘోరంగా నిరాశపరిచిన ఐదుగురు ఆటగాళ్ల ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలర్ ప్రఫుల్ హింగే.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తన డెబ్యూ మ్యాచ్‌లోనే 4 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అందులోనూ 3 వికెట్లు తన మొదటి ఓవర్లోనే తీశాడు. కానీ ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లే తీసి లయ తప్పాడు. ముఖ్యంగా ఆ తర్వాతి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ తలపడినప్పుడు వైభవ్ సూర్యవంశీ ఈ బౌలర్‌ను చెడుగుడు ఆడుకున్నాడు.

ఇక, లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2.60 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ముకుల్ చౌదరి కథ కూడా ఇంతే. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అజేయంగా 54 పరుగులు చేసి లక్నోకు 3 వికెట్ల విజయాన్ని అందించిన ముకుల్.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను చేసినవి కేవలం 116 పరుగులే. మరోవైపు, జోష్ హేజిల్‌వుడ్ అందుబాటులో లేకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో జట్టులోకి తెచ్చుకున్న జాకబ్ డఫ్ఫీకి అవకాశం ఇచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే డఫ్ఫీ 3 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కానీ ఆ తర్వాత అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు, వచ్చిన అవకాశాల్లోనూ రాణించలేదు. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతను భారీగా పరుగులు సమర్పించుకుని కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు.

మరోవైపు.. ముంబై ఇండియన్స్ రూ. 1 కోటి బేస్ ప్రైస్‌తో దక్కించుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్.. పంజాబ్ కింగ్స్‌పై అజేయంగా 112 పరుగులు చేసి జట్టులో చోటు సుస్థిరం అనుకునేలా చేశాడు. కానీ ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 13, 7 పరుగులు మాత్రమే చేసి ప్లేయింగ్-11 నుంచి స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత గాయం కారణంగా అతను ఏకంగా ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఇక ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరలేక తీవ్రంగా నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు యువ బ్యాటర్ ఉర్విల్ పటేల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో చెన్నై రిటైన్ చేసుకున్న ఉర్విల్.. లక్నో సూపర్ జెయింట్స్‌పై కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మొత్తంగా 65 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే ఆ తర్వాతి 6 ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను చేసిన పరుగులు కేవలం 64 మాత్రమే కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలా మెరుపులా మెరిసి ఆ తర్వాత పూర్తిగా చతికిలపడిన ఈ ఐదుగురు ఆటగాళ్ల ప్రదర్శన ఈ సీజన్‌లో ఒక ఆసక్తికరమైన చర్చగా మారింది.