Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..

Bhuvneshwar Kumar Rcb

Bhuvneshwar Kumar Rcb

Bhuvneshwar Kumar: సెలక్షన్ కమిటీ తనను పక్కన పెట్టినప్పటికీ, టీమ్ ఇండియా ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ కుమార్ మాత్రం ఐపీఎల్ 2026లో తన గణాంకాలతో సంచలనం సృష్టిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న 36 ఏళ్ల భువీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు పడగొట్టి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. 2022 తర్వాత భారత జట్టుకు దూరమైనా, గడిచిన 3-4 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. పవర్‌ప్లేలో భువీని మించిన బౌలర్ భారత క్రికెట్‌లో లేదని స్పష్టమవుతోంది. 2023 నుంచి ఐపీఎల్‌లో పవర్‌ప్లే (తొలి ఆరు ఓవర్లు) గణాంకాలను చూస్తే భువనేశ్వర్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సీజన్‌లో కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి ఆర్‌సీబీకి వెన్నెముకగా నిలిచాడు.

2023 నుంచి ఐపీఎల్ పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు:
భువనేశ్వర్ కుమార్: 32
ట్రెంట్ బౌల్ట్: 32
మొహమ్మద్ సిరాజ్: 28
మొహమ్మద్ షమీ: 28
దీపక్ చాహర్: 24

ప్రపంచంలోనే అత్యుత్తమ న్యూ బాల్ బౌలర్‌గా పేరొందిన ట్రెంట్ బౌల్ట్‌తో సమానంగా వికెట్లు తీయడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా బ్యాటింగ్‌కు స్వర్గధామాలైన బెంగళూరు, హైదరాబాద్ పిచ్‌లపై ఈ ఘనత సాధించడం భువీ నైపుణ్యానికి అద్దం పడుతోంది. కేవలం ప్రస్తుత ఫామ్ మాత్రమే కాదు, ఐపీఎల్ చరిత్రలోనే భువనేశ్వర్ ఒక లెజెండ్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు మూడు వికెట్లు తీసిన బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (25) తర్వాత భువీ (20 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ‘డాట్ బాల్స్’ వేసిన రికార్డు సైతం తన పేరిటే ఉంది. ఇటీవల 200 వికెట్ల మైలురాయిని దాటిన తొలి భారత పేసర్‌గా చరిత్ర సృష్టించిన భువీ, ప్రస్తుతం 212 వికెట్లతో దూసుకుపోతున్నాడు.

వాస్తవానికి.. 2022 ప్రపంచకప్ తర్వాత వేగం తగ్గిందనే విమర్శలతో భువనేశ్వర్ కుమార్‌ను జట్టుకు దూరం చేశారు. కానీ, 2026 సీజన్ గణాంకాలు చూస్తుంటే, ఒక అనుభవజ్ఞుడైన బౌలర్ పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మారాడో అర్థమవుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జట్లు ఈజీగా 200 పైచిలుకు స్కోర్లు చేస్తున్న తరుణంలో పవర్‌ప్లేలో వికెట్లు తీస్తూ 8.00 లోపు ఎకానమీని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బుమ్రాకు సరైన జోడీ కోసం వెతుకుతున్న టీమ్ ఇండియాకు, భువనేశ్వర్ కుమార్ ప్రస్తుత ఫామ్ ఒక బలమైన సంకేతం పంపిస్తోంది. ఒకవేళ సెలక్టర్లు నిజంగా ‘ఇంపాక్ట్’ చూపే ఆటగాడి కోసం చూస్తుంటే, బెంగళూరు అటాక్‌ను ముందుండి నడిపిస్తున్న భువీ వైపు చూడక తప్పదు.