IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!

  • ఒకే రోజు రెండు జట్లు ఇంటికి
  • ఐపీఎల్ 19వ సీజన్‌లో టాప్ లేపిన ఆర్సీబీ
  • ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం
IPL 2026 Playoffs

IPL 2026 Playoffs

ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరాటాలు టోర్నీ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ఒకే రోజు రెండు జట్లకు చుక్కెదురైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలయ్యాయి. ఈ ఓటములతో ముంబై, లక్నో జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు టాప్ లేపగా.. చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సులువు చేసుకుంది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్ల నష్టానికి 166 పరుగులకే పరిమితం అయింది. తిలక్‌ వర్మ (57) హాఫ్ సెంచరీ చేయగా.. నమన్‌ ధీర్‌ (47) రాణించాడు. ఎంఐ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ చివరి బంతికి 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ విజయంలో కృనాల్ పాండ్య వీరోచిత పోరాటం చేశాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడి 73 పరుగులతో అర్ధ శతకాన్ని నమోదు చేసి జట్టును గెలిపించాడు.

ఈ విజయంతో ఆర్సీబీ 7 విజయాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు ఈ సీజన్‌లో 8వ ఓటమిని చవిచూసిన ముంబై కథ ముగిసింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో లక్నో కూడా టోర్నీలో ఎనిమిదో ఓటమిని నమోదు చేసింది. ఫలితంగా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఇకపై ముంబై, లక్నో జట్ల పోరాటాలు నామమాత్రమే. ఒకే రోజు రెండు బలమైన జట్లు ఇంటిబాట పట్టడంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. కేకేఆర్, ఢిల్లీ టీమ్స్ అధికారికంగా నిశక్రమించకున్నా.. రేసులో లేనట్లే. ప్లేఆఫ్స్ రేసులో ఇప్పుడు 6 టీమ్స్ (బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్, పంజాబ్, చెన్నై, రాజస్థాన్) ఉన్నాయి. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి టాప్-4లో నిలవాలని ఆరు టీమ్స్ గట్టి పట్టుదలతో ఉన్నాయి.