IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకు మరింత ఉత్కంఠగా మారుతోంది. శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 29 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపుకు అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవడమే కాకుండా.. టాప్ లేపుదామనుకున్న జీటీకి షాక్ తగిలింది. కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీతో పాయింట్ల పట్టికలో సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
సీజన్ ప్రారంభంలో తొలి ఆరు మ్యాచ్‌లలో ఐదు ఓటములు చవిచూసిన కేకేఆర్.. ఇప్పుడు అద్భుతమైన కంబ్యాక్ చేస్తోంది. ప్రస్తుతం 12 మ్యాచ్‌లలో 11 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న కేకేఆర్.. మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే కేవలం మూడు పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే.. కేకేఆర్ 15 పాయింట్లకు చేరుకుంటుంది. ఇతర జట్ల ఫలితాలు అనుకూలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ కూడా దక్కే అవకాశం ఉంది. ఇక గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కూడా ఆసక్తికరంగానే మారింది. ప్రస్తుతం 13 మ్యాచ్‌లలో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న జీటీ.. ప్లేఆఫ్స్‌కు అధికారిక అర్హత సాధించాలంటే చివరి మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పట్టికలో ఆర్సీబీ 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధిస్తుంది. రెండు మ్యాచ్‌లలో గెలిస్తే టాప్ ప్లేస్ సాధిస్తుంది. ప్రస్తుత సమీకరణాలు ప్రకారం 20 పాయింట్స్ సాధించే అవకాశాలు ఏ జట్టుకు లేవు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే అధికారిక బెర్త్ దక్కుతుంది. ఒక్కటి గెలిస్తే టాప్ 4లో ఉండే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌లలో గెలిస్తే.. టాప్ 2లో ఉండే అవకాశాలు ఉంటాయి. రెండు గెలిస్తే టాప్ 4లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చెన్నై, ఢిల్లీలకు అవకాశం ఉండదు. కేకేఆర్ పరిస్థితి కూడా ఇంతే. ఇక ముంబై, లక్నో ఇప్పటికే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.
