Site icon NTV Telugu

Ishan Kishan-SRH: మా ప్లాన్ చాలా సింపుల్.. ఆటగాళ్లకు అదొక్కటి మాత్రం చెబుతాను!

Ishan Kishan-SRH

Ishan Kishan-SRH

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు అందుకుంది. ఢిల్లీ విజయం అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ జట్టు వ్యూహాల గురించి వెల్లడించాడు. తమ ప్లాన్ చాలా సింపుల్ అని, మ్యాచ్‌ను మ్యాచ్‌గా తీసుకుంటాం అని చెప్పాడు. జట్టులో అందరూ దూకుడుగా ఆడాలని కోరుకుంటారని తెలిపాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో తాము గెలిచామని ఇషాన్ పేర్కొన్నాడు.

‘చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడాలో అర్థం కావడం లేదు. అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం, చివర్లో హెన్రిచ్ క్లాసెన్ బాగా ఫినిష్ చేయడం చూసిన తర్వాత మాట్లాడడానికి పెద్దగా ఏమీ లేదు. ఈ తరహా పిచ్‌పై 200కు పైగా స్కోర్ చేయడం చాలా గొప్ప విషయం. బంతి పాతబడిన తర్వాత కొత్తగా క్రీజ్‌లోకి వచ్చే బ్యాటర్లకు పెద్ద షాట్లు ఆడటం అంత సులభం కాదు. అయినా కూడా ఈ విజయంలో మొత్తం క్రెడిట్ అభిషేక్‌కే ఇవ్వాలి. మా ప్లాన్ చాలా సింపుల్. మ్యాచ్‌ను మ్యాచ్‌గా ఆడుతున్నాం అంతే. మేమెప్పుడూ ఒక్కో మ్యాచ్‌ గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాం. ఒక్కరోజు ఒకరు బాధ్యతగా ఆడుతున్నారు. జట్టులో ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడాలని ఇష్టపడతారు. అందుకే మొదటి 2-3 బంతులు ఆడి పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకుంటారు. బౌన్స్ ఎలా ఉందో చూసి, ఆ తర్వాత బ్యాట్ జుళిపిస్తారు. మేం ఎక్కువగా ప్లాన్‌లు చేసుకోం, బంతిని చూసి ఆడటమే మా విధానం’ అని ఇషాన్ స్పష్టం చేశాడు.

‘హర్ష్‌ దూబే బౌలింగ్‌ను కొనసాగించడంపై ఎలాంటి వ్యూహం లేదు. బంతులు, పరుగుల రేషియోను బట్టి బౌలింగ్‌ ఇచ్చాం. ఈ తరహా పిచ్‌లపై బ్యాటర్లు భారీ షాట్స్ ఆడడం అంత సులభం కాదు. దూబే మంచి బౌలర్, చాలా తెలివిగా బౌలింగ్ చేస్తాడని నాకు తెలుసు. అందుకే అతనితో మాట్లాడి నువ్వు కీలక ఓవర్లు వేయాలి అని చెప్పాను. మా ప్లాన్ ఏమిటంటే ప్రత్యర్థి జట్టులో బెస్ట్ బ్యాటర్లు క్రీజ్‌లో ఉన్నప్పుడు మా బెస్ట్ బౌలర్లను ఉపయోగించడం. అది మాకు బాగా వర్క్ అయింది. ఇక నేను డ్రెస్సింగ్ రూమ్‌లో ఎక్కువగా మాట్లాడను. ఆటను ఆస్వాదించమని మాత్రమే మా ఆటగాళ్లకు చెబుతా’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.

 

Exit mobile version