Sunrisers Hyderabad: మైల్‌స్టోన్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి.. అదే కొంపముంచిందన్న ఇషాన్ కిషన్!

  • ఎస్‌ఆర్‌హెచ్ మరో అరుదైన మైలురాయి
  • మైల్‌స్టోన్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి
  • అదే కొంపముంచిందన్న ఇషాన్ కిషన్
Ishan Kishan Comments

Ishan Kishan Comments

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) మరో అరుదైన మైలురాయిని అందుకుంది. నేడు ఎస్‌ఆర్‌హెచ్ తన 200వ మ్యాచ్‌ను ఆడింది. 2013లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సన్‌రైజర్స్‌.. తక్కువ సమయంలోనే మెగా లీగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే మైల్‌స్టోన్ మ్యాచ్‌లో మాత్రం ఓటమిని ఎదుర్కొంది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఎస్‌ఆర్‌హెచ్ 219 రన్స్ చేయగా.. లక్షాన్ని పీబీకేఎస్ 18.5 ఓవ‌ర్ల‌లోనే ఊదిప‌డేసింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని చెప్పాడు. ‘మాకు అద్భుతమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు 6 ఓవర్లలోనే 100 రన్స్ చేశారు. అదే మూమెంట్ కొనసాగిస్తే 240-250 పరుగులు చేయగలిగేవాళ్లం. కానీ మధ్యలో కొన్ని తప్పిదాలు జరిగాయి. అయినప్పటికీ 219 మంచి టోటల్. మా జట్టులో ఆరు నుంచి ఏడు మంది మంచి బౌలర్లు ఉన్నారు కాబట్టి ఈ స్కోర్‌ను కాపాడగలమని అనుకున్నాం. టీ20 క్రికెట్‌లో ముఖ్యమైనది మంచి బంతులను సరైన ప్రదేశాల్లో వేయడం. కానీ ఈరోజు మేము ఆ విషయంలో విఫలమయ్యాం. ప్లాన్‌లు సరిగ్గా అమలు చేయలేకపోయాం. అదే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లు సులభంగా పరుగులు చేయడానికి కారణమైంది’ అని ఇషాన్ చెప్పాడు.

కెప్టెన్‌గా బౌలర్లతో చర్చలపై కూడా ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ రోజుల్లో ప్లాన్స్ ఎక్కువగా మ్యాచ్‌కు ముందే చేస్తాం. ప్రతి బ్యాటర్ ఎలా ఆడతాడో తెలుసుకుంటాం. కానీ మ్యాచ్‌లో ముఖ్యమైంది ఎగ్జిక్యూషన్. మీరు సరైన లెంగ్త్, లైన్‌లో బౌలింగ్ చేయకపోతే ప్రతి ఓవర్‌లో 10-20 పరుగులు ఇవ్వాల్సి వస్తుంది. 200+ స్కోర్లు సేఫ్ కాదా అన్నది ఎక్కువగా ఆలోచించం. బ్యాటింగ్ చేస్తే పరుగులు చేయాలి, బౌలింగ్ చేస్తే రన్స్ కాపాడాలి. కానీ సరైన ప్రణాళిక, అమలు లేకపోతే ఎంత స్కోర్ చేసినా ఉపయోగం ఉండదు’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.