Site icon NTV Telugu

Abhishek Sharma-POM: ఈరోజు మైదానంలో లేదు, బాధగా ఉంది.. ఈ ఇన్నింగ్స్ ఆమెకు అంకితం!

Abhishek Sharma-POM

Abhishek Sharma-POM

Abhishek Sharma Dedicates His POM to Sister: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ రెచ్చిపోయాడు. 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సులతో 135 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అవార్డు తీసుకున్న అనంతరం అభిషేక్‌ మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే నా టార్గెట్ అని చెప్పాడు. పవర్‌ప్లేను పూర్తిగా వినియోగించుకోవాలనే ప్రణాళికతోనే తాను, ట్రావిస్ హెడ్ కలిసి బ్యాటింగ్‌కు దిగామని వెల్లడించాడు. అవార్డును తన కుటుంబానికి అంకితం ఇస్తున్నట్లు అభిషేక్‌ చెప్పాడు.

‘మేము ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం చూస్తే..స్పష్టమైన ప్రణాళిక ఉందని అనిపించింది. నేను, హెడ్డి (ట్రావిస్ హెడ్) కలిసి పవర్‌ప్లేను పూర్తిగా వినియోగించుకోవాలని ముందే నిర్ణయించుకున్నాం. అయితే క్రీజ్‌లోకి వెళ్లిన తర్వాత పిచ్ కొంచెం నెమ్మదిగా ఉందని గమనించాం. అందుకే మళ్లీ మా ప్లాన్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆడాం. నేను ఎప్పటిలానే పవర్‌ప్లేను వినియోగించుకోవాలని ప్రయత్నించాను. ఈ మైదానంలో పరుగులు చేయడం ఎప్పుడూ నాకు ప్రత్యేకంగానే అనిపిస్తుంది. ముందే చెప్పినట్లుగా 20 ఓవర్లు ఆడే వరకు సరైన స్కోర్ ఏంటో తెలియదు. నా మనసులో ఎప్పుడూ ఒకటే ఉంటుంది.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలి’ అని అభిషేక్‌ పేర్కొన్నాడు.

‘జట్టు కోచ్‌లు, కెప్టెన్ ఇచ్చిన స్వేచ్ఛకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. మైదానంలో మన ఆటను స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వడం చాలా ముఖ్యం. మూడు సంవత్సరాల క్రితం నేను నా ప్రతిభను చూపించాలని అనుకునేవాడిని. పవర్‌ప్లేలో, బౌలర్లపై ధాటిగా ఆడాలనుకునేవాడిని. అయితే కెప్టెన్, కోచ్ మద్దతు చాలా ముఖ్యం. అది నాకు దక్కింది. 2024లో సన్‌రైజర్స్‌లో ఉన్న వాతావరణం మా అందరికీ గేమ్‌చేంజర్‌గా మారింది. అది కేవలం జట్టుగా గెలవడం మాత్రమే కాదు.. యువ ఆటగాళ్లను స్టార్స్ చేయాలనే లక్ష్యం. నేను ఎప్పుడూ ఇలాగే ఆడాలనుకున్నాను. పంజాబ్ జట్టులో కూడా అలాగే ఆడాను. హైదరాబాద్‌లో స్వేచ్ఛగా ఆడుతా’ అని అభి చెప్పాడు.

‘నేను చాలా కాలంగా ‘L’ సెలబ్రేషన్ చేస్తూనే ఉన్నాను. ఇది స్టేడియం, అభిమానులపై ఉన్న ప్రేమకు సూచిక. టోర్నమెంట్‌లో ప్రేక్షకులు మాకు ఇచ్చే మద్దతు అద్భుతం. హోటల్ దగ్గర కూడా మద్దతు బాగా ఉంటుంది. నా వంతుగా వారికి ప్రేమను చూపించాలనుకుంటాను. ఈ రోజు నా తల్లిదండ్రులు మైదానంలో ఉన్నారు. ఇది చాలా ప్రత్యేకమైన క్షణం. ఐతే నా సోదరి ఈ రోజు ఇక్కడ లేదు. ఇన్‌ఫెక్షన్ కారణంగా హైదరాబాద్ రాలేదు. ఈ ఇన్నింగ్స్ ఆమెకు అంకితం ఇస్తున్నా. అండర్-12 రోజుల నుంచి నా తండ్రి ఎప్పుడూ మ్యాచ్ చూస్తూ ఉంటారు. హైదరాబాద్‌లో కూడా స్టేడియంలోనే ఉంటారు. నేను నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నప్పుడు కూడా ఎలా ఆడాలో సూచనలు ఇస్తుంటారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. కెమెరాలో నాన్న కనబడితే ఆయన రియాక్షన్స్ చూడటం చాలా సరదాగా ఉంటుంది. నేను ఆయనను చూస్తాను, ఆయన నన్ను చూస్తూ సూచనలు ఇస్తారు. అది నాకు ఎంతో సహాయపడుతుంది. తల్లిదండ్రులు, స్నేహితుల ముందు బాగా ఆడటం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది’ అని అభి సంతోషం వ్యక్తం చేశాడు.

 

Exit mobile version