Site icon NTV Telugu

Hardik Pandya: ఏం మాట్లాడాలో తెలియడం లేదు.. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదు!

Hardik Pandya Comments

Hardik Pandya Comments

Hardik Pandya About MI Defeat To PBKS: ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ముంబై 6 వికెట్లకు 195 పరుగులు చేయగా.. పంజాబ్‌ 16.3 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శనపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేనని, ప్రస్తుతం ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నాడు. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదని, మొత్తం టీమ్ మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య మాట్లాడుతూ… ‘నిజం చెప్పాలంటే.. ఇప్పుడు మాట్లాడానికి ఎక్కువగా ఏమీ లేదు. మేము ఎక్కడ తప్పు చేస్తున్నామో ముందు తెలుసుకోవాలి. అది వ్యక్తిగతం గానా, జట్టు గానా లేదా ప్లానింగ్‌లోనా అన్నది గుర్తించాలి. మరలా అన్ని అంశాలను విశ్లేషించాల్సిందే. మేము అనుకున్న దానికంటే తక్కువ రన్స్ చేశాం. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. బంతి రివర్స్ స్వింగ్ అవ్వడం ప్రారంభమైంది. అదే సమయంలో పిచ్ కూడా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం రావడంతో బ్యాటింగ్ కొంచెం సులభమైంది. అయినప్పటికీ పంజాబ్ అన్ని విభాగాల్లో మాకంటే మెరుగ్గా రాణించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో మెరుగ్గా ఆడారు. అదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది’ అని తెలిపాడు.

జట్టు భవిష్యత్తు గురించి మాట్లాడిన హార్దిక్ పాండ్య.. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించాడు. ‘మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలా? లేదా ఇదే జట్టుతో కొనసాగుతూ పరిస్థితులు మారుతాయని ఆశించాలా? అనే ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలి. వరుస ఓటములు ఎదురయ్యాయి. ఇది మాకు కఠిన సమయం. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలి. ఏదైనా సరే బాధ్యత తీసుకోవాల్సిందే’ అని హార్దిక్ స్పష్టం చేశాడు. హార్దిక్ వ్యాఖ్యలు ముంబైలో పరిస్థితి అంత సానుకూలంగా లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. జట్టు త్వరగా సమస్యలను గుర్తించి పరిష్కారం కనుక్కోకపోతే.. ఐపీఎల్ 2026లో మరింత వెనుకబడే ప్రమాదం ఉంది.

Exit mobile version