IPL 2026 GT vs RR Qualifier 2 Playing 11: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. నేడు జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు తలపడబోతున్నాయి. చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఫైనల్ బెర్త్ సమరం సమరం నేపథ్యంలో ఆర్ఆర్ vs జీటీ క్వాలిఫయర్-2 ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
ముగ్గురి పైనే ఆధారపడుతున్న గుజరాత్:
లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్ అత్యంత నిలకడగా రాణించింది. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అయితే క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి చవిచూసింది. 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జీటీ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైంది. రాహుల్ తేవాటియా ఒక్కడే 68 పరుగులతో పోరాడినా జట్టును కాపాడలేకపోయాడు. మొత్తంగా 162 పరుగులకే ఆలౌట్ అయి 92 పరుగుల తేడాతో ఓడిపోయింది. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ బ్యాటింగ్‌పైనే జీటీ ఆధారపడుతుండడం పెద్ద మైనస్ అనే చెప్పాలి. వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సింధు, జేసన్ హోల్డర్ రాణించాల్సిన అసవరం ఉంది. రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో బౌలింగ్ బాగుంది.
వైభవ్‌ను ఆపేది ఎవరు?:
రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ ఇప్పటికీ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసిన బుడ్డోడు.. 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో ఎస్ఆర్‌హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అతడి దూకుడు కారణంగానే రాజస్థాన్ 243/8 అనే భారీ స్కోర్ నమోదు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక దానిపైనే ఉంది.. సూర్యవంశీని ఆపేది ఎవరు?. రబాడ, సిరాజ్, రషీద్ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నా.. వైభవ్ ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను చూస్తుంటే అతడిని కట్టడి చేయడం అంత ఈజీ కాదు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసే సామర్థ్యం అతడికి ఉంది. అందుకే తొలి ఆరు ఓవర్లు ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకంగా మారనున్నాయి.
ఫేవరేట్‌గా రాజస్థాన్:
స్కోర్ అంచనాల ప్రకారం గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 220-240 మధ్య స్కోర్ చేసే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 250కు పైగా స్కోర్ చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న మొమెంటమ్, వైభవ్ ఫామ్‌ను చూస్తుంటే రాజస్థాన్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
బ్యాటర్లకు అనుకూలంగా పిచ్:
ముల్లాన్‌పూర్ పిచ్ ఈ సీజన్ మొత్తం బ్యాటర్లకు బాగా సహకరించింది. ప్రారంభంలో పేసర్లకు కొంత బౌన్స్, స్వింగ్ లభించినా.. మ్యాచ్ సాగేకొద్దీ బ్యాటింగ్ మరింత సులభంగా మారుతోంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 170-180 మధ్యలో ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే ఈ మ్యాచ్‌లో 220+ స్కోరు కూడా సాధ్యమేనని అంచనాలు ఉన్నాయి. రాత్రి మ్యాచ్ కావడంతో డ్యూ కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.
హెడ్ టు హెడ్ రికార్డ్స్:
హెడ్ టు హెడ్ రికార్డుల్లో గుజరాత్ టైటాన్స్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 10 సార్లు తలపడగా.. జీటీ 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. రాజస్థాన్ 3 విజయాలు మాత్రమే సాధించింది. అయితే ఈ సీజన్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలుచుకోవడంతో.. క్వాలిఫయర్-2 మరింత ఆసక్తికరంగా మారింది.
లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్:
అభిమానులు క్వాలిఫయర్-2 మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తేవాటియా, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరెరా, దసున్ షనాకా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.
