Axar Patel: మిచెల్ స్టార్క్‌తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!

  • కీలక విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌
  • డీసీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
  • ఆర్‌ఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం
Axar Patel Interview

Axar Patel Interview

Axar Patel Reveals Interesting Chat With Mitchell Starc: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) మరో కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్‌ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో డీసీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో డీసీ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు వరుస ఓటములతో ఆర్‌ఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి.

మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ‘వరుస పరాజయాల తర్వాత సొంత మైదానంలో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్‌లో ఇది మా చివరి హోమ్ మ్యాచ్ కావడంతో మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది. అభిమానులు మాకు మద్దతుగా ఉన్నారు. ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఓపెనింగ్ భాగస్వామ్యం బాగుండటంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు మ్యాచ్‌ను ఫినిష్ చేయగలిగారు. ఇంతకుముందు ఓటముల్లో వికెట్లు వరుసగా పడిపోవడం మాకు పెద్ద సమస్యగా మారింది. కానీ ఈ మ్యాచ్‌లో ఒక్కో వికెట్ పడిన తర్వాత మరో భాగస్వామ్యం ఏర్పడింది. అదే విజయానికి కారణమైంది’ అని తెలిపాడు.

డీసీ బౌలింగ్ యూనిట్‌పై కూడా అక్షర్ పటేల్ ప్రశంసలు కురిపించాడు. ‘పవర్‌ప్లేలో పరుగులు ఇచ్చినా.. మిడిల్ ఓవర్లలో బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌ల్లో మేము బలమైన కంబ్యాక్ ఇచ్చాం. పవర్‌ప్లేలో పరుగులు వచ్చినా.. ఆ తర్వాత మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. స్ట్రాటజిక్ టైమ్‌అవుట్ సమయంలో కూడా మ్యాచ్ ఇప్పుడే మొదలైందని, ఎప్పుడైనా ప్రత్యర్థి ఎదురుదాడి చేయొచ్చని మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ముఖ్యంగా 14వ ఓవర్ తర్వాత బౌలర్లు చెలరేగారు. మా బౌలర్లు పరిస్థితులకు తగ్గట్టు ప్రణాళికలను మార్చుకుని సక్సెస్ అయ్యారు’ అని అక్షర్ వివరించాడు.

మిచెల్ స్టార్క్‌తో జరిగిన చర్చల గురించి అడగగా అక్షర్ పటేల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘ఆ సమయంలో కొత్త బ్యాటర్‌కు ఏ ఫీల్డ్ సెట్ చేయాలన్నదే ప్రధాన చర్చ. నేను స్టార్క్‌ను అభినందించాను. తర్వాత కొత్త బ్యాటర్‌కు ఎలాంటి బంతులు వేయాలనుకుంటున్నాడో అడిగి దానికి అనుగుణంగా ఫీల్డింగ్ సెట్ చేశాం. ఆ తర్వాత నేను చాలా దూరంగా వెళ్లాను. నా అదృష్టం క్యాచ్ అక్కడే వచ్చింది’ అని తెలిపాడు. మొత్తానికి ఈ విజయంతో ఢిల్లీ మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. చివరి హోమ్ మ్యాచ్‌లో అభిమానులకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన డీసీ.. ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌లపై పూర్తి దృష్టి పెట్టనుంది.