Ajinkya Rahane Captaincy: కేకేఆర్ కెప్టెన్సీ వదిలేయాలనిపించలేదా?.. ఆజింక్య రహానే ఆసక్తికర సమాధానం ఇదే!

  • లీగ్ దశ నుంచే నిష్క్రమించిన కేకేఆర్
  • పట్టికలో ఏడవ స్థానంలో కేకేఆర్
  • సారథ్యంలో తేలిపోయిన ఆజింక్య రహానే
Ajinkya Rahane Captaincy

Ajinkya Rahane Captaincy

Ajinkya Rahane on KKR Captaincy: ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్) ఆశించిన స్థాయిలో రాణించలేదు. అజింక్య రహానే నాయకత్వంలో బరిలోకి దిగిన కేకేఆర్.. లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న కోల్‌కతా.. చివర్లో పుంజుకున్నప్పటికీ ప్లేఆఫ్స్ బెర్త్ అందుకోలేకపోయింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో 13 పాయింట్స్ ఖాతాలో వేసుకుని.. పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? అనే ప్రశ్నకు జింక్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అజింక్య రహానే.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం తన స్వభావం కాదని స్పష్టం చేశాడు. ‘నేను కెరీర్ మొత్తం మంచి అటిట్యూడ్‌తో క్రికెట్ ఆడాను. నాకు క్యారెక్టర్ చాలా ముఖ్యం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. నేను ఎప్పుడూ వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు. వరుసగా ఐదు, ఆరు మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు ఒత్తిడి సహజం. కానీ ఆ సమయంలో గతం లేదా భవిష్యత్తు గురించి కాకుండా ప్రస్తుతం ఏం చేయాలో దానిపైనే దృష్టి పెట్టాలి’ అని రహానే చెప్పాడు.

ఈ సీజన్‌లో కేకేఆర్ తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓటములు చవిచూసి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరింది. అయితే తర్వాతి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 40 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో అజింక్య రహానే వ్యక్తిగతంగా కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 14 మ్యాచ్‌ల్లో 335 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా అతడి స్ట్రైక్‌రేట్ టోర్నీలోనే తక్కువగా నమోదైంది. అయితే జింక్స్ తన కెప్టెన్సీపై వచ్చిన విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. ‘మ్యాచ్‌లు ఓడిపోతే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. కానీ ఆటలో ఎప్పుడైనా తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ వెనక్కి తగ్గను. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే ఆలోచన ఒక్కసారి కూడా రాలేదు’ అని స్పష్టం చేశాడు.

2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించిన రహానే.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసని మరోసారి చూపించాడు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు గాయాల సమస్య కూడా పెద్ద దెబ్బగా మారింది. హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ వంటి కీలక బౌలర్లు గాయపడగా.. బీసీసీఐ ఆదేశాలతో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను కూడా జట్టు విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో భారత యువ బౌలర్లపై నమ్మకం ఉంచినట్లు రహానే తెలిపాడు. ‘మా భారత బౌలర్లకు సమయం ఇవ్వాలని అనుకున్నాను. ఒత్తిడిలో వారు బాగా రాణిస్తారనే నమ్మకం నాకు ఉంది’ అని చెప్పాడు.

అవకాశాలను యువ ఆటగాళ్లు అనుకూల్ రాయ్, కార్తిక్ త్యాగీ అద్భుతంగా వినియోగించుకున్నారు. కార్తిక్ ఈ సీజన్‌లో 18 వికెట్లు తీసి భారత బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అనుకూల్ 12 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. రెండు విజయవంతమైన చేజ్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరికీ ఇది కేవలం ఆరంభమేనని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకునే సామర్థ్యం ఉందని రహానే ప్రశంసించాడు.