Site icon NTV Telugu

IPL Highest Team Scores: ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ల వర్షం.. ఎస్‌ఆర్‌హెచ్‌దే హవా, టాప్-10 లిస్ట్ ఇదే!

Srh1

Srh1

Highest Team Totals IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే అభిమానులకు గుర్తుకొచ్చేది భారీ సిక్సర్లు, పరుగుల వర్షం. ముఖ్యంగా ఇటీవల సీజన్లలో బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడుతూ రికార్డు స్థాయి స్కోర్లను నమోదు చేస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో 250కి పైగా స్కోర్లు సాధారణంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్లు నమోదు చేసిన జట్ల టాప్-10 జాబితా ఆసక్తికరంగా నిలిచింది. ఈ లిస్ట్ ఏంటో చూద్దాం.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) అగ్రస్థానంలో నిలిచింది. 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఎస్‌ఆర్‌హెచ్ 287/3 స్కోర్ చేసింది. రెండో స్థానంలో ఎస్‌ఆర్‌హెచ్ టీమే నిలవడం విశేషం. 2025లో రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్ఆర్)పై 286/6 స్కోర్ నమోదు చేసింది. మూడో స్థానంలో కూడా సన్‌రైజర్స్ జట్టే ఉంది. ముంబై ఇండియన్స్‌పై 2024లో 277/6 స్కోర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ చేసింది. టాప్ 3లో మొత్తం ఎస్‌ఆర్‌హెచ్ ఉండడం విశేషం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్, హెన్రిచ్ క్లాసెస్ వంటి హిట్టర్లు జట్టులో ఉండడంతో సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేస్తోంది.

నాలుగో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఉంది. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ 272/7 స్కోర్ చేసింది. ఐదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266/7 రన్స్ చేసింది. ఇలా టాప్-5లోనే ఎస్‌ఆర్‌హెచ్ నాలుగు సార్లు ఉండడం ఆ జట్టు బ్యాటింగ్ శక్తిని చూపిస్తుంది. ఆరవ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2013లో పూణే వారియర్స్ ఇండియాపై చేసిన 263/5 స్కోర్ ఉంది. ఇది చాలా కాలం పాటు ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్‌గా కొనసాగింది.

Also Read: IPL 2026 Records: మెయిడెన్ ఓవర్ల మాయాజాలం.. ఐపీఎల్‌లో మొత్తం మనోళ్లదే హవా!

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ చేసిన జాబితాలో పంజాబ్ కింగ్స్ ఏడో స్థానంలో ఉంది. 2024లో కేకేఆర్‌పై పంజాబ్ 262/2 స్కోర్ చేసింది. ఎనిమిదో స్థానంలో ఆర్సీబీ ఉండగా.. 2024లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 262/7 స్కోర్ నమోదు చేసింది. తొమ్మిదో స్థానంలో కేకేఆర్ 2024లో పంజాబ్‌పై 261/6 స్కోర్ చేసింది. పదో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2024లో ముంబై ఇండియన్స్‌పై 257/4 స్కోర్‌తో నిలిచింది. ఈ గణాంకాలు చూస్తే.. ఐపీఎల్‌లో బ్యాటింగ్ ప్రభావం ప్రతి సీజన్‌కు పెరుగుతోంది. 2024 సీజన్‌లోనే ఎక్కువగా ఈ భారీ స్కోర్లు నమోదవ్వడం విశేషం. భవిష్యత్తులో 300 పరుగుల మైలురాయి కూడా సాధ్యమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version