Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించనున్నాడు. ఈ ప్రత్యేక నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్‌కు కొత్త వాతావరణంలో అలవాటు పడేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. అంతే కాదు.. వైభవ్ తల్లిదండ్రుల ప్రయాణ ఖర్చులను కూడా బీసీసీఐనే భరిస్తుందని సైకియా తెలిపారు. సీనియర్ జాతీయ జట్టులో 14 లేదా 15 ఏళ్ల వయసున్న ఆటగాడు ఉండటం చాలా అరుదైన విషయమని, ఇలాంటి పరిస్థితుల్లో యువ ఆటగాడికి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
“గతంలో సచిన్ టెండూల్కర్ చాలా చిన్న వయసులోనే భారత జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి అరుదైన ప్రతిభగా ఎదిగాడు. సీనియర్ జట్టులో మిగతా ఆటగాళ్లు, సిబ్బంది అంతా పెద్దవాళ్లే. అలాంటి వాతావరణంలో ఒక చిన్న వయస్కుడు సౌకర్యంగా ఉండేందుకు తల్లిదండ్రులు దగ్గర ఉండటం ఉపయోగపడుతుందని భావించాం” అని సైకియా తెలిపారు.
ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో 776 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ప్రదర్శనకు గుర్తింపుగా ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులు దక్కాయి. ఈ అద్భుత ప్రదర్శనతోనే అతనికి భారత టీ20 జట్టులో తొలి పిలుపు వచ్చింది. భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్‌గా ఇప్పటికే వైభవ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీలంకలో వివాదం
సీనియర్ జట్టులో చేరకముందు వైభవ్ భారత-ఏ తరఫున శ్రీలంకలో జరిగిన త్రైసిరీస్‌లో ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ జట్లతో జరిగిన ఈ టోర్నీలో ఒక మ్యాచ్ సందర్భంగా ఆతిథ్య జట్టు ఆటగాడితో మైదానంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ వ్యవహారంలో బీసీసీఐ జోక్యం చేసుకోదని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. మ్యాచ్‌లో జరిగిన సంఘటనలపై నిర్ణయం తీసుకునే అధికారం మ్యాచ్ రిఫరీలు, అంపైర్లకే ఉంటుందని చెప్పారు. “మైదానంలో జరిగే విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంది. బీసీసీఐ ఆ పరిధిలోకి వెళ్లదు” అని ఆయన వివరించారు.
కొత్త ప్రయాణానికి సిద్ధమైన వైభవ్
భారత జట్టులో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కులలో ఒకరిగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ.. ఐర్లాండ్ మరియు ఇంగ్లండ్ పర్యటనల ద్వారా తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించబోతున్నాడు. ఈ పర్యటనలో కుటుంబ సభ్యుల అండతో మరింత ఆత్మవిశ్వాసంతో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.. అయితే, ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఏ మ్యాచ్ ఆడినా.. బ్యాటింగ్ ఎలా చేస్తాడు.. ఎన్ని పరుగులు చేస్తాడు.. వైభవ్ బ్యాటింగ్ ఎలా ఉంది.. ఇలాంటి అంశాలపై క్రికెట్ ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు..

