Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) జాతీయ జట్టు నిర్మాణంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లకు ప్రత్యేక జట్లను ఏర్పాటు చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మార్పులో భాగంగా ఫార్మాట్ ఆధారిత సెంట్రల్ కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. పీసీబీ సీనియర్ సెలెక్టర్, హై పెర్ఫార్మెన్స్ సెంటర్ హెడ్ ఆకిబ్ జావేద్ ప్రకారం, ఆధునిక క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ ఒకే ఆటగాళ్లపై ఆధారపడటం ఇక సాధ్యం కాదన్నారు. ప్రతి ఫార్మాట్‌కు వేర్వేరు నైపుణ్యాలు అవసరమవుతాయని, ముఖ్యంగా టెస్ట్ మరియు టీ20 క్రికెట్‌కు పూర్తిగా భిన్నమైన దృక్పథం అవసరమని పేర్కొన్నారు.
కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ విధానంలో ఆటగాళ్లను వారి ప్రదర్శన ఆధారంగా వేర్వేరు విభాగాలుగా విభజించనున్నారు. టెస్ట్ స్పెషలిస్టులను ఇతర టెస్ట్ ఆటగాళ్లతోనే పోల్చి మూల్యాంకనం చేయడంతో పాటు, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే వారికి అధిక వేతనాలు అందించనున్నారు. టెస్ట్-వన్డే, వన్డే-టీ20 విభాగాలకు కూడా ప్రత్యేక కేటగిరీలు ఉండనున్నాయి. ఈ విధానం ద్వారా టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యం పెంచడంతో పాటు, ప్రత్యేక ఫార్మాట్ ఆటగాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా పీసీబీ ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో ఒకే దేశం నుంచి మూడు వేర్వేరు జట్లు బరిలోకి దిగే పరిస్థితి రావచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పాకిస్థాన్ క్రికెట్‌లో ఈ మార్పు విజయవంతమైతే, ప్రపంచ క్రికెట్‌లోనూ ఇదే తరహా వ్యవస్థకు మార్గం సుగమం కావచ్చనే చర్చ మొదలైంది.

