Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?

Manav Suthar Ravindra Jadej

Manav Suthar Ravindra Jadej

Ravindra Jadeja: భారత టెస్టు క్రికెట్‌లో స్పిన్ విభాగానికి కొత్త వారసుడు దొరికాడా? యువ ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ అద్భుత అరంగేట్ర ప్రదర్శన తర్వాత ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఇదే చర్చ సాగుతోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో తన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న మనవ్ సుతార్, భవిష్యత్తులో భారత స్పిన్ టీమ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశాలను బలంగా చాటిచెప్పాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన టెస్టులో ఎడమచేతి స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మనవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతని కచ్చితమైన లైన్, లెంగ్త్, బంతికి ఇచ్చిన ఫ్లైట్, డ్రిఫ్ట్ మరియు నియంత్రణ క్రికెట్ నిపుణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో అరంగేట్ర టెస్టులోనే ఐదు వికెట్లు సాధించిన ఏడో భారత స్పిన్నర్‌గా, పదో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

భారత క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ కూడా సుతార్ ప్రదర్శనను ప్రశంసలతో ముంచెత్తాడు. భారత పిచ్‌లలో స్పిన్నర్లకు అనుకూల పరిస్థితులు ఉంటాయని చాలామంది చెబుతారని, కానీ ఆఫ్ఘనిస్థాన్‌పై సుతార్ విజయానికి పిచ్ కంటే అతని నైపుణ్యం, కచ్చితత్వమే ప్రధాన కారణమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అతని బౌలింగ్ యాక్షన్ సరళంగా ఉండటంతో ప్రతి బంతిని ఒకే ప్రాంతంలో వేయగల సామర్థ్యం అతనికి లభించిందని పేర్కొన్నాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సుతార్ తన ప్రతిభను చాటుకున్నాడు. భారత్ 564/8 డిక్లేర్ చేసిన ఇన్నింగ్స్‌లో 41 బంతుల్లో 28 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతని ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇప్పటికే ఒక సెంచరీ, ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. దీంతో అతను కేవలం స్పెషలిస్ట్ బౌలర్ మాత్రమే కాకుండా విలువైన ఆల్‌రౌండర్ అని నిరూపించుకున్నాడు.

×
×
Ad

జడేజా స్థానానికి నిజంగానే ముప్పా?
మనవ్ సుతార్ అద్భుత ప్రదర్శన తర్వాత సహజంగానే ఒక ప్రశ్న ముందుకు వస్తోంది. భారత టెస్టు జట్టులో కీలక ఆటగాడైన రవీంద్ర జడేజా స్థానానికి ముప్పు ఏర్పడిందా? అనే చర్చ హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న జడేజా తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు. మరోవైపు, భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారత జట్టు కొత్త స్పిన్ ఆల్‌రౌండర్లను సిద్ధం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే భారత ప్రధాన సెలెక్టర్ అజిత్‌ అగార్కర్‌ ఇటీవల స్పష్టంగా చెప్పినట్లుగా, జడేజా ఇప్పటికీ భారత టెస్టు జట్టులో నంబర్ వన్ స్పిన్నర్‌గానే కొనసాగుతున్నాడు. అతను జట్టులో కీలక భాగమని కూడా పేర్కొన్నాడు. కాబట్టి ప్రస్తుతం జడేజా స్థానానికి తక్షణ ముప్పు ఉందని చెప్పడం కంటే, భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసే ప్రక్రియలో మనవ్ సుతార్ కీలక ఎంపికగా ఎదుగుతున్నాడని చెప్పడం సరైనది. ఇప్పటికే జట్టులో అక్షర్‌ పటేల్‌ వంటి మరో ఎడమచేతి స్పిన్ ఆల్‌రౌండర్ ఉన్నప్పటికీ, అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టుకు మరిన్ని నాణ్యమైన స్పిన్ ఎంపికలు అవసరం. ఆ ఖాళీని భర్తీ చేసే సామర్థ్యం తనకు ఉందని మనవ్ సుతార్ తొలి టెస్టులోనే నిరూపించాడు.

అయితే, శ్రీలంక పర్యటన, న్యూజిలాండ్ పర్యటన, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లు సుతార్‌కు అసలైన పరీక్షగా నిలవనున్నాయి. అరంగేట్ర మ్యాచ్‌లో చూపించిన ప్రతిభను బట్టి చూస్తే, భవిష్యత్తులో జడేజా వారసుడిగా అక్షర్ పటేల్‌తో పాటు మనవ్ సుతార్ కూడా బలమైన పోటీదారుడిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత క్రికెట్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ల సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే తదుపరి స్టార్‌గా మనవ్ సుతార్ ఎదుగుతాడా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ అతని డెబ్యూ ప్రదర్శన మాత్రం భారత జట్టు భవిష్యత్తుపై ఆశలు పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.