NTV Telugu Site icon

Asia Cup 2022: నేటి నుంచే ఆసియాకప్.. టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఆరు జట్ల అమీతుమీ

Asia Cup

Asia Cup

Asia Cup 2022: నేటి నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టోర్నీ ప్రారంభం కానుంది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా అక్కడి ఆర్ధిక పరిస్థితుల కారణంగా యూఏఈకి షిఫ్ట్ చేశారు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. దీంతో అన్ని జట్లు టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొత్తం ఆరు జట్లు.. 13 మ్యాచ్‌లు.. 16 రోజుల పాటు జరగనున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి.

Read Also: ఇండియాలో 10 అంతుపట్టని ప్రదేశాలు..

ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆదివారం నాడు టోర్నీలోనే హైఓల్టేజ్ మ్యాచ్‌ జరగబోతోంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో రికార్డు స్థాయిలో ఆసియా కప్‌ను టీమిండియా ఏడు సార్లు గెలుచుకుంది. గత రెండు సార్లు జరిగిన ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అందరి దృష్టి పేలవ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీపైనే ఉంది. ఆసియా కప్‌తో కోహ్లీ ఫామ్‌లోకి రావాలని అతడి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

టోర్నీ ఫార్మాట్ ఇదే..
గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, హాంకాంగ్, గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ఉన్నాయి. తమ గ్రూప్‌లోని 2 జట్లతో ఆడిన అనంతరం టాప్2 టీమ్‌లు ముందంజ వేస్తాయి. అక్కడ మూడు టీమ్‌లతో పోటీ పడాలి. ఇందులో టాప్-2 జట్లు ఫైనల్‌కు చేరతాయి. దుబాయ్, షార్జాలలోనే అన్ని మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్ 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.