Indian Women Team Lost First Match Against Australia In CWG 2022: గురువారం నుంచి ప్రారంభమైన బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ కూడా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే! కామన్‌వెల్త్‌లో క్రికెట్‌ను భాగం చేయడం ఇదే తొలిసారి. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మొదటి మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మహిళ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ప్రదర్శించిన ప్రదర్శనను మొదట చూసి.. సునాయాసంగా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆసీస్ ప్లేయర్ ఆష్లే గార్డ్‌నర్ ఆ అంచనాల్ని బోల్తా కొట్టించేసింది. చివర్లో ఆమె విశ్వరూపం దాల్చడంతో.. ఆసీస్ విజయం సాధించగలిగింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభం చేయడంతో స్కోర్ బోర్డు పరుగులు తీసింది. స్మృతి మందానా (24), షెఫాలి వర్మ (48) బాగా రాణించారు. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ అర్థశతకంతో చెలరేగింది. అయితే.. మిగతా ప్లేయర్స్ అంత ఆశాజనకమైన ప్రదర్శనని కనబర్చలేదు. దీంతో భారత్ స్కోర్ 154/8 గా నమోదైంది. ఇక లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. ఆదిలో తడబడింది. తొలి ఐదు వికెట్లు వెనువెంటనే పడ్డాయి. 49 పరుగులకే ఐదు వికెట్లు పడటంతో, ఈ మ్యాచ్ భారత్‌దేనని అంతా ఫిక్సయ్యారు. కానీ.. ఆ తర్వాత వచ్చిన గార్డ్‌నర్ (35 బంతుల్లో 52) ఆ అంచనాల్ని తిప్పికొట్టింది.
తొలుత గ్రేస్ హారిస్‌తో కలిసి గార్డ్‌నర్ వికెట్ పడకుండా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. హారిస్ ఔటైన తర్వాత కూడా గార్డ్‌నర్ వెనక్కు తగ్గలేదు. భారీ షాట్లతో చెలరేగిపోయింది. ఇండియన్ బౌలింగ్‌పై తాండవం చేసింది. వికెట్లు పడుతున్నా, ఒత్తిడికి గురి కాకుండా పరుగుల వర్షం కురిపించింది. దీంతో.. మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఫలితంగా.. ఒక ఓవర్, మూడు వికెట్లు మిగిలుండగానే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేధించింది. రేణుకా సింగ్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ రెండు, మేఘనా సింగ్ ఒక వికెట్ తీశారు. ఇతర బౌలర్లు పరుగులు బాగా సమర్పించుకున్నారు.
స్కోర్ బోర్డు:
ఇండియా: 154/8
ఆస్ట్రేలియా: 157/7