భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ రెండు మ్యాచ్‌లు ముగిసిపోయాయి. రేపు మూడో మ్యాచ్ విశాఖపట్నంలోని డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే భారత్, దక్షిణాఫ్రికా జట్లు విశాఖపట్నంకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రుషికొండ బీచ్‌లో మన భారత క్రికెటర్లు కాసేపు సందడి చేశారు. పైగా, బీచ్ రోడ్‌లోని ఓ హోటల్‌లోనే ఇరు జట్ల క్రీడాకారులు బస చేస్తున్నారు. బీచ్ పక్కనే అంటే, ఎవరైనా టెంప్ట్ అవ్వకుండా ఉంటారా? కచ్ఛితంగా ఒక్కసారైనా వెళ్లి బీచ్‌లో మునిగితేలాలని అనుకుంటారు. మన భారత క్రికెటర్స్ అందుకు మినహాయింపు కాదు.
కాగా.. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ నెగ్గాలంటే, భారత్ మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. తొలి మ్యాచ్‌లో భారత బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా.. భారీ లక్ష్యాన్ని సైతం దక్షిణాఫ్రికా చేధించగలిగింది. రెండో మ్యాచ్‌లో బ్యాట్స్మన్లు చేతులెత్తేయడంతో స్వల్ప లక్ష్యమే నిర్దేశించగలిగారు. బౌలర్లు చివరిదాకా ప్రత్యర్థి బ్యాట్స్మన్లను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు కానీ, అవసరమైనప్పుడు కీలక వికెట్లు తీయకపోవడంతో మ్యాచ్ చేజారింది. దీంతో, ఎలాగైనా మిగిలిన మ్యాచెస్ గెలవాలని భారత్ ఆటగాళ్లు కసి మీదున్నారు. ఇక నుంచి ప్రతి ఒక్కరు ఉన్నత ఆటతీరుని కనబరిస్తేనే, దక్షిణాఫ్రికాపై భారత్ పైచేయి సాధించగలదు.