మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (175 నాటౌట్) విజృంభించడంతో 574/8 భారీ స్కోరు చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌట్ కావడంతో ఫాలో ఆన్‌లో పడింది. చాన్నాళ్ల తర్వాత శ్రీలంక జట్టును భారత్ ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ శ్రీలంక 178 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో మూడు రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ముగిసిపోయింది. మూడో రోజు ఒక్కరోజే 16 వికెట్లు నేలకూలాయి.
ఈ మ్యాచ్‌లో హీరో ఎవరు అంటే నిస్సందేహంగా రవీంద్ర జడేజానే. తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగులు చేయడమే కాకుండా మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడికి మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పూర్తి సహకారం అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జడేజానే కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. కాగా విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్టు కావడం విశేషం. మొత్తానికి 100వ టెస్టులో సెంచరీ చేయకపోయినా కోహ్లీ భారీ విజయంతో ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.
