IND Vs WI: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ వెస్టిండీస్‌పై 59 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా మరో టీ20 మిగిలి ఉండగానే ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. అతడు తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేసి వెనుతిరిగాడు. సంజూ శాంసన్ 23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీపక్ హుడా 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివర్లో అక్షర్ పటేల్ 8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్‌తో నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల హోసెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
Read Also: Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?
అనంతరం 192 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. బ్రెండన్ కింగ్ 13 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. వెంటనే డేవాన్ థామస్ (1) కూడా పెవిలియన్ బాట పట్టాడు. నికోలస్ పూర్(24), కైల్ మేయర్స్(13), రోవ్‌మన్ పొవెల్ (24) కూడా వరుసగా వెనుతిరిగారు. దీంతో విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. సాధించాల్సిన రన్‌రేట్ క్రమంగా పెరుగుతూ పోయింది. హోల్డర్ (13) కూడా నిరాశపరిచాడు. దీంతో 19.1 ఓవర్లలో 132 పరుగులకు వెస్టిండీస్ ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్ రెండు, రవి బిష్ణోయ్ 2 వికెట్లు సాధించారు. అంతకుముందు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. అశ్విన్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ స్థానంలో సంజు శాంసన్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ ముందు కుర్రాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మార్పులు చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. కాగా సిరీస్‌లో చివరి నామమాత్రమైన టీ20 ఆదివారం రాత్రి జరగనుంది.
