India Won Against Pakistan In T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ శుభారంభం చేసింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో.. పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించింది. పాక్ కుదిర్చిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ చేధించింది. విరాట్ కోహ్లీ (82) విశ్వరూపం చూపించడంతో పాటు హార్దిక్ పాండ్యా రాణించడంతో.. భారత్ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒకానొక దశలో ఓడిపోతుందనుకున్న భారత్.. చివర్లో నెగ్గింది. దాయాది దేశాన్ని మట్టికరిపించి, ఒక గొప్ప విజయాన్ని నమోదు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. ఓపెనర్లు వెంటనే ఔటైనా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాన్ మసూద్ (52), ఇఫ్తికార్ అహ్మద్(51) అర్థశతకాలతో లాక్కొచ్చారు. మూడో వికెట్‌కి 76 పరుగులు జత చేసి, తమ పాక్ జట్టుని ఆదుకున్నారు. ఆ తర్వాత వరుస వికెట్లు పడినా, ఓవైపు మసూద్ పరుగుల వర్షం కురిపించాడు. చివర్లో అతనికి షాహీన్ ఆఫ్రీది చేయూతనందించడంతో, పాక్ జట్టు 159 పరుగులు చేయగలిగింది. ఇక 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మొదట్లో తడబడింది. వరుస వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడిపోయింది. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడం, తొలి 10 ఓవర్లలో 45 పరుగులే చేయడంతో.. భారత్ నెట్టుకురావడం దాదాపు కష్టమేనని అంతా భావించారు.
అయితే.. క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మాత్రం మ్యాచ్‌ని ఒక్కసారిగా మలుపు తిప్పేశారు. వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదుతూ వచ్చారు. మరీ ముఖ్యంగా.. మొదట్లో చాలా మెల్లగా ఆడిన కోహ్లీ, ఆ తర్వాత తన విశ్వరూపం చూపించాడు. ఫోర్లు, సిక్సులతో అదరగొట్టేశాడు. చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉండగా, హార్దిక్ పాండ్యా ఔటవ్వడంతో భారత్ మళ్లీ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే.. బౌలర్ ఒక నోల్ బాల్ వేయడం, కోహ్లీ కూడా సిక్స్‌తో చెలరేగడంతో, చేధన సులభతరం అయ్యింది. 2 బంతుల్లో 2 పరుగులు చేయాలన్నప్పుడు కార్తీక్ ఔటయ్యాడు. చివర్లో వచ్చిన అశ్విన్.. సింగిల్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఏదేమైనా.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ హీరోగా నిలిచాడు.