NTV Telugu Site icon

IND Vs SL: శ్రీలంకతో మహిళల టీ20 సిరీస్‌ టీమిండియాదే..!!

India Women

India Women

శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా మహిళలు 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు. శనివారం దంబుల్లా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ అలవోకగా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మేరకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45), కెప్టెన్ ఆటపట్టు (43) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీసుకుంది. రేణుక సింగ్, పూజా, రాధాయాదవ్, హర్మన్ ప్రీత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు.

126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి శుభారంభం దక్కింది. స్మృతి మంధాన 34 బంతుల్లో 39 పరుగులు, షఫాలి వర్మ 10 బంతుల్లో 17 పరుగులు, సబ్బినేని మేఘన 10 బంతుల్లో 17 పరుగులు చేశారు. దీంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 80 పరుగులకు చేరుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (31 నాటౌట్)తో కలిసి 3వ వికెట్‌కు స్మృతి మంధాన 38 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. దీంతో 11వ ఓవర్ చివరి బంతికి 86 పరుగుల వద్ద ఔటయ్యింది. స్మృతి అవుటైన తర్వాత స్కోరు వేగం మందగించింది. దీంతో హర్మన్ ప్రీత్‌కౌర్ ఆచితూచి ఆడింది. 20వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టి హర్మన్ ప్రీత్ కౌర్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది. శ్రీలంక బౌలర్లలో రణిసింగే, రణవీర తలో రెండు వికెట్లు పడగొట్టారు. హర్మన్ ప్రీత్ కౌర్ ఆల్‌రౌండ్ ప్రతిభ చూపడంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

IND Vs IRE: కుర్రాళ్లకు మంచి ఛాన్స్.. రేపటి నుంచే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్

 

Show comments