India vs West Indies T20I First Match First Innings: బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్‌లు వీరవిహారం చేశారు. ఇద్దరూ కలిసి వెస్టిండీస్ బౌలర్లతో ఫుట్‌బాల్ ఆడేసుకున్నారు. ఎడాపెడా షాట్లు బాదుతూ ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత్ బరిలోకి దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(44 బంతుల్లో 64) , సూర్యకుమార్ (24) కాసేపు నిలకడగా రాణించారు. తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. సూర్యకుమార్ ఔటయ్యాక వెనువెంటనే టీమిండియా వికెట్లు కోల్పోయింది. ఓవైపు రోహిత్ శర్మ నెట్టుకొస్తుంటే, మరోవైపు వికెట్స్ పడుతున్నాయి. అప్పుడొచ్చాడు దినేశ్ కార్తిక్.. విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 41 పరుగులు చేశాడు. దినేశ్ ఆడిన ఈ భీకర ఇన్నింగ్స్ కారణంగా భారత్ 190 పరుగుల మార్క్‌ని అందుకోగలిగింది.
ఇక వెస్టిండీస్ బౌలింగ్ విషయానికొస్తే.. అల్జారి జోసెఫ్ 2 వికెట్లు తీయగా.. ఒబెడ్ మెక్‌కాయ్, జేసన్ హోల్డర్, అకీల్ హుసేన్, కీమో పాల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఒక్క అకీల్ మాత్రమే 4 ఓవర్లు వేసి 14 పరుగులిస్తే.. మిగతా వాళ్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా.. జోసెఫ్ (46) , హోల్డర్ (50) బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు చితక్కొట్టేశారు.