Site icon NTV Telugu

IND Vs WI: నేటి నుంచి రోహిత్ సారథ్యంలో ఐదు టీ20ల సిరీస్.. అశ్విన్ ఆడతాడా?

Team India

Team India

IND Vs WI: శిఖర్ ధావన్ నేతృత్వంలోని వన్డే సమరం ముగిసింది. నేటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 సిరీస్ సమరానికి తెర లేవనుంది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ కూడా చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్, హార్డిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లాంటి స్టార్ ఆటగాళ్లు టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. వన్డే సిరీస్‌లో తుది జట్టులో ఆడిన సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, అవేష్ ఖాన్, అక్షర్ పటేల్ మాత్రమే టీ20 సిరీస్‌లో కొనసాగనున్నారు. కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. దీంతో రిషబ్ పంత్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్డిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ వరుస స్థానాల్లో ఆడనున్నారు.

జడేజా ఫిట్‌గా ఉంటే అతడు బరిలోకి దిగనున్నాడు. ఒకవేళ అతడు దూరమైతే అశ్విన్‌ను తుదిజట్టులో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో అశ్విన్ ఉంటే అతడు తుది జట్టులోకి వస్తాడు లేదంటే దీపక్ హుడా లేదా అక్షర్ పటేల్ తుది జట్టులో స్థానం సంపాదించనున్నారు. పేస్ విభాగంలో భువనేశ్వర్, హర్షల్ పటేల్‌కు తోడుగా అవేష్ ఖాన్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌లలో ఒకరిని రోహిత్ ఎంచుకోవచ్చు. అయితే వన్డే సిరీస్‌లో తేలిపోయిన వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో పుంజుకునే అవకాశాలున్నాయి. పూరన్, పావెల్, హోల్డర్, కైల్ మేయర్స్, అల్జారి జోసెఫ్, హుస్సేన్‌లతో విండీస్ బలంగానే కనిపిస్తోంది. విండీస్ జట్టులో ఎక్కువగా హిట్టర్లే ఉండటంతో భారత బౌలర్లు వాళ్లకు కళ్లెం ఎలా వేస్తారో వేచి చూడాలి.

Exit mobile version