NTV Telugu Site icon

IND vs SA: నేడు రెండో టీ20.. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

Ind Vs Sa Second T20

Ind Vs Sa Second T20

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే! భారీ స్కోరు (211) చేసినప్పటికీ.. బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా బోల్తా కొట్టేసింది. దీంతో, ఈరోజు జరగనున్న రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. అందుకు బౌలింగ్ విభాగంలో భారత్ పుంజుకోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విషయంలో భారత్‌కి ఎలాంటి ఢోకా లేదు. ఆరో వికెట్ దాకా దూకుడుగా రాణించే బ్యాట్స్మన్లే ఉన్నారు. బౌలర్లే తమ సత్తా చాటుకోవాల్సి ఉంటుంది.

స్వింగ్ మాస్టర్ అయిన భువనేశ్వర్ తొలి టీ20లో ఆఖరి ఓవర్లలో భారీ పరుగులు సమర్పించేసుకున్నాడు. అటు, ఐపీఎల్‌లో అదరగొట్టిన హర్షల్ పటేల్ కూడా ఎక్కువ పరుగులిచ్చాడు. అవేశ్ ఖాన్ పెద్దగా ఆకట్టుకోలేదు. హార్దిక్ బ్యాట్‌తో మెరుపులైతే మెరిపించాడు కానీ, బంతితో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయాడు. కాబట్టి.. ఈసారి వీళ్లందరూ తమ తప్పుల్ని గ్రహించి, కట్టుదిట్టంగా బౌలింగ్ వేయాల్సి వస్తుంది. దక్షిణాఫ్రికాలో ఉన్న బ్యాట్స్మన్లను ముప్పుతిప్పలు పెట్టాలన్నా, పెవిలియన్ చేర్పించాలన్నా.. అంత సులువైన విషయం కాదు. కాబట్టి, బౌలర్లు జాగ్రత్తగా బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల్ని గందరగోళానికి గురి చేసేలా వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. డేవిడ్ మిల్లర్, డికాక్, డసెన్‌లను అడ్డుకుంటే.. దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించినట్టే!

ఇక ఈ రెండో టీ20 బారాబటి స్టేడియం వేదికగా జరగనుంది. ఇంతకుముందు రెండు టీ20 మ్యాచ్‌లకు ఈ మైదానం ఆతిథ్యమిచ్చింది. అందులో ఒక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలోనే భారత్ 92 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో శ్రీలంకను 87 పరుగులకే భారత్ కట్టడి చేయగలిగింది. ఈ పిచ్ స్పిన్నర్లకి అనుకూలం. కాబట్టి, భారత స్పిన్నర్లకు సత్తా చాటేందుకు ఇది సువర్ణవకాశం. బ్యాటింగ్ విషయంలో ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. మరి, ఈ పిచ్‌పై భారత్ తన ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.